కేసుల భయంతోనే!

22 Jun, 2019 04:38 IST|Sakshi

బ్యాంకులకు రుణం ఎగ్గొట్టిన కేసులో సుజనాపై ఈడీ కొరడా

డొల్ల కంపెనీలతో బురిడీ కొట్టించిన సీఎం రమేష్‌

రాజధాని ప్రాంతంలో ముందుగానే భూములు కొన్న ఎంపీలు

విచారణ నుంచి కాపాడుకునేందుకు బీజేపీలో చేరారంటున్న తెలుగు తమ్ముళ్లు

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేతకు కుడి, ఎడమలుగా చెప్పుకునే ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ముందస్తు ప్రణాళికలో భాగంగానే బీజేపీలో చేరినట్లు తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈడీ, ఆదాయపన్ను కేసులతోపాటు రాజధానిలో కొనుగోలు చేసిన రూ.వందల కోట్ల విలువైన భూములను కాపాడుకోవడానికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పంచన చేరారంటున్నారు. బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్ల మేర రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ పూర్తి ఆధారాలను సేకరించడంతో అరెస్ట్‌ల భయంతోనే ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి సుజనా చౌదరి ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపినట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు.

దొంగ కంపెనీల పేరు మీద తీసుకున్న రూ.364 కోట్ల రుణాలు ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరపకుండానే హైదరాబాద్‌లోని వైస్రాయ్‌ హోటల్‌కు చేరినట్లు ఈడీ దర్యాప్తులో తేలడంతో  వైస్రాయ్‌ హోటల్‌కు చెందిన రూ.315 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. ఇప్పుడు ఈ మొత్తం వైస్రాయ్‌ హోటల్‌ నుంచి చివరకు ఎక్కడకు చేరిందన్న అంశం వెల్లడి కావాల్సి ఉంది. ఈ కేసులో ఇక అరెస్ట్‌ తప్పకపోవడంతో పాటు కుంభకోణం వెనుక ఉన్న పెద్ద వ్యక్తులు బయటకు వస్తారన్న భయంతోనే బీజేపీ పెద్దలు అమిత్‌ షా, రాంమాధవ్‌లతో సంప్రదింపులు జరిపారని, దీనికి ప్రధాని మోదీ ఆమోదముద్ర వేయడంతో సుజనా చౌదరి బీజేపీలో చేరారంటున్నారు. సీఎం రమేష్‌ కూడా రిత్విక్‌ ఇన్‌ఫ్రా పేరిట దొంగ ఇన్వాయిస్‌లు సృష్టించి రూ.800 కోట్ల నిధులను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఐటీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ కేసులో సీఎం రమేష్‌ ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు అరెస్ట్‌ చేయడమే మిగిలింది.

రాజధానిపై విచారణ భయంతో..
రాజధానిగా అమరావతిని ప్రకటించడం వెనుక పెద్ద ఎత్తున ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందనే ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లు, కేటాయింపులపై సమీక్ష చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో బాబు బినామీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజధాని ప్రాంతం వివరాలను చంద్రబాబు ముందుగానే తన అనుయాయులకు లీక్‌ చేసి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. రాజధాని ప్రకటన వెలువడక ముందే సుజనా చౌదరి 700 ఎకరాలు, సీఎం రమేష్‌ 500 ఎకరాల వరకు బినామీల పేరుతో కొనుగోలు చేసినట్లు తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా చెబుతున్నారు. టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావులు కూడా రాజధానికి చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వీరి వ్యాపారాలు కూడా ప్రస్తుతం సమస్యల్లో ఉన్నాయి. ఇప్పుడు రాజధాని భూములపై విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్న భయం వీరిని వెంటాడుతోంది. 

మరిన్ని వార్తలు