పేరు కోసమే కొత్త భవనాలు 

2 Jul, 2019 02:11 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై మండిపడిన కాంగ్రెస్‌ నేతలు

సచివాలయం, అసెంబ్లీ భవనాల సందర్శన  

కొత్త భవనాలతో ప్రజాధనం దుర్వినియోగమని వెల్లడి 

మరమ్మతులతో 50 ఏళ్లు వాడుకోవచ్చని సూచన

సాక్షి, హైదరాబాద్ : వచ్చే వందేళ్ల వరకు ఉండగలిగే భవనాలను కూల్చి కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శించారు. నీళ్లు, నిధుల కోసం తెచ్చు కున్న తెలంగాణ.. కేవలం నలుగురు వ్యక్తుల చేతు ల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, టి.జీవన్‌ రెడ్డి, రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, విశ్వేశ్వర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి, మాజీ మంత్రి ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఆర్‌ (టి.రామ్మోహన్‌ రెడ్డి), విజయరమణారావు, కొండేటి శ్రీధర్‌తో కూడి న బృందం సోమవారం రాష్ట్ర సచివాలయం, శాసనసభ భవనాలను సందర్శించింది. ఈ సందర్భంగా విలేకరులతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. శిలాఫలకాలపై తన పేరు ఉండాలనే తపన కోసమే కేసీఆర్‌ కొత్త భవనాల నిర్మాణం పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

ఉమ్మడి రాష్ట్రంలో సీఎం, 42 మంది మంత్రులు, 294 మంది ఎమ్మెల్యేలతో పాలన సాగిన సచివాలయం, అసెంబ్లీ ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలకు సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. 1980లో మర్రి చెన్నారెడ్డి హయాంలో కొన్ని భవనాలు నిర్మిస్తే, 2012, 2013లో కొన్నింటిని నిర్మించారని, ఈ నిర్మాణాలకు 30 ఏళ్లు కూడా దాటలేదని వివరించారు. ఉన్న వాటిని కూల్చి కొత్తవి కట్టడం దుర్మార్గమన్నారు. ఇంత పెద్ద సచివాలయంలో ఇప్పటికే అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయని, మళ్లీ కొత్తగా కట్టాల్సిన పనిలేదని, చిన్న చిన్న మరమ్మతులతో వాటిని సరిచేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ మహారాజు, చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  ప్రజాధనం దుర్వినియోగం.. కొత్త భవనాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అన్యాయమని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ మూఢ నమ్మకాలను కాంగ్రెస్‌ పార్టీ పూర్తి వ్యతిరేస్తోందన్నారు. నేడు రూ.400 కోట్లు అని చెప్పిన కేసీఆర్‌ అంచనాలు.. రూ.2 వేల కోట్ల వరకు పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని, దీన్ని సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ భవనాల్లో ఇంకా 50 ఏళ్ల వరకు ఉండొచ్చని తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ శాఖలను ఇక్కడికి తరలించాలని కోరారు. ముందు విద్యను అభివృద్ధి చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు.

అమరవీరుల కోసం స్తూపం నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్‌ ఐదేళ్లు దాటినా ఒక ఇటుక కూడా పెట్టలేదని, అదే విధంగా కుల సంఘాలకు భవనాలు నిర్మిస్తామన్నా ఆ ఊసేలేదని ధ్వజమెత్తారు. సచివాలయ నిర్మాణంపై ఇప్పటికే హైకోర్టులో కేసు ఉందన్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని, అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామన్నారు. రైతులు, ఉద్యోగుల సమస్యలను సీఎం పట్టించుకోవాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. పక్క రాష్ట్రం సీఎం ఐఆర్‌ ప్రకటించారని గుర్తుచేశారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశానికి హాజరుకాని ఏకైక వ్యక్తి కేసీఆరేనని అన్నారు. ఎర్రమంజిల్‌లో మెట్రో, షాపింగ్, వివిధ రకాలు కార్యాలయాలు ఉన్నాయని.. అసెంబ్లీ అక్కడికి మారిస్తే తీవ్రమైన ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఆసిఫాబాద్‌లో మహిళా అటవీ అధికారిపై ప్రజాప్రతినిధి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. పోడు భూములను తీసుకోవడం తప్పు అన్నారు. పోడు భూముల వద్ద కుర్చి వేసుకొని పేదలకు పంచుతానన్న సీఎం హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.  
    

>
మరిన్ని వార్తలు