కాంగ్రెస్ నేతకు తైవాన్ మహిళ షాక్.. వైరల్ వీడియో

13 Dec, 2017 12:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో ఓట్ల కోసం కాంగ్రెస్ యువనేత అల్పేశ్‌ ఠాకూర్‌ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీ భోజనం ఖర్చు రోజులకు రూ.4 లక్షలంటూ పఠాన్‌ జిల్లాలోని రాధన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న కాంగ్రెస్ అభ్యర్థి అల్పేశ్‌ ఠాకూర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తైవాన్ మహిళ మెస్సీ జో స్పష్టం చేశారు. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. తైవాన్ నుంచి తెప్పించిన స్పెషల్ పుట్టగొడుగులు (మష్రూమ్స్) మోదీ తింటారని, వాటివల్లే ఆయన అందంగా, ఆరోగ్యంగా ఉంటారన్నది అవాస్తవమని చెప్పారు. అల్పేశ్ చేసిన ఆరోపణల్లో నిజంలేదని, అందుకు నిదర్శనంగా తైవాన్ మహిళ పలు విషయాలను వెల్లడించిన వీడియోను ప్రమోద్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

తైవాన్ మహిళ ఏమన్నారంటే.. భారత మీడియాలో తైవాన్ పుట్టగొడుగుల గురించి వార్త చదివాను. భారత ప్రధాని మోదీ తైవాన్ మష్రూమ్స్ తినడం వల్లే అందంగా, ఆకర్షణీయంగా తయారయ్యారని కథనాలు చూశాను. కానీ ఇందులో ఇసుమంతైనా నిజం లేదు. మా దేశం (తైవాన్‌)లో అలాంటి మష్రూమ్స్ లేవు. అసలు వాటి గురించి ఎప్పుడూ వినలేదు. రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణల్లో నిజం లేదంటూ వీడియో ద్వారా మెస్సీ జో వెల్లడించారు. దీంతో ఓట్ల కోసమే కాంగ్రెస్ అభ్యర్థి అల్పేశ్‌ ఠాకూర్‌ ప్రధాని మోదీపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
కాంగ్రెస్ అభ్యర్థి అల్పేశ్‌ ఠాకూర్‌ మంగళవారం స్థానికంగా నిర్వహించిన ఒక సభలో మాట్లాడుతూ.. 'ప్రధాని మోదీగారు తినేది సాధారణ భోజనం కాదు. తైవాన్‌ నుంచి తెప్పించే పుట్టగొడుగులు(మష్రూమ్స్) తింటారు. రూ.80 వేలు ఖరీదైన మష్రూమ్స్ రోజుకు ఐదు తింటారు. అంటే ఆయన భోజనం ఖర్చు రోజుకు రూ.4లక్షలు. భారీ స్థాయిలో తన ఆహారానికి మోదీ ఖర్చు చేస్తున్నారంటూ' తీవ్ర ఆరోపణలు చేశారు.
 

మరిన్ని వార్తలు