అసెంబ్లీలో నిరసన.. కౌన్సిల్‌లో ఘర్షణ!

16 Jun, 2020 08:00 IST|Sakshi

గవర్నర్‌ ప్రసంగం తర్వాత అసెంబ్లీ నుంచి వాకౌట్‌ లేదా బాయ్‌కాట్‌

కౌన్సిల్‌లో మాత్రం రెండు రోజులు ఉండాలని నిర్ణయం

మూడు రాజధానుల బిల్లు పెడితే అడ్డుకోవడమే టీడీపీ వ్యూహం

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపి బయటకు వచ్చేయాలని, కౌన్సిల్‌లో మాత్రం రెండురోజులు చర్చలో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం టీడీపీ శాసనసభాపక్షం, వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

మొదటి రోజు గవర్నర్‌ ప్రసంగం తర్వాత ప్రవేశపెట్టే ధన్యవాద తీర్మానంపై చంద్రబాబుకు అవకాశం వచ్చాక అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టులు అక్రమమని మాట్లాడి ఆ రోజు సమావేశాలను బాయ్‌కాట్‌ చేయాలని, అనంతరం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని మొదట భావించారు. కానీ అదే రోజు బడ్జెట్‌ ప్రవేశపెడుతుండడంతో వాకౌట్‌ చేసి గవర్నర్‌ను కలిసి తిరిగి బడ్జెట్‌ సమయంలో సభకు రావాలని నిర్ణయించినట్లు సమాచారం. గవర్నర్‌ ప్రసంగంపై మాట్లాడేటప్పుడు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని, అవసరమైతే గొడవకు సిద్ధపడాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. రెండో రోజూ సభలో నిరసనలు తెలుపుదామని చెప్పినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల అరెస్టులు, కేసులపైనే ప్రధానంగా మాట్లాడాలని, వైఎస్సార్‌సీపీ ఏడాది పాలనలో అవినీతి జరిగిందనే విషయాలను లేవనెత్తాలనేది టీడీపీ వ్యూహమని సమాచారం.

కౌన్సిల్‌ కీలకం.. అందరూ రావాలి
శాసనమండలిలో మాత్రం రెండు రోజులు సభ్యులంతా పాల్గొనాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మూడు రాజధానుల సహా ముఖ్యమైన బిల్లులు మళ్లీ కౌన్సిల్‌లోకి వచ్చే అవకాశం ఉంటుందని, వస్తే వాటిని అడ్డుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లుపై ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చూడాలని, ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలన్నింటినీ యనమల చూసుకుంటారని తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా