ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి

19 May, 2018 05:13 IST|Sakshi
బిహార్‌ గవర్నర్‌ సత్యపాల్‌తో తేజస్వీ యాదవ్‌

గోవా, మణిపుర్, బిహార్‌ గవర్నర్లతో కాంగ్రెస్, ఆర్జేడీ నేతల భేటీ  

పట్నా / పణజి / ఇంఫాల్‌: కర్ణాటక గవర్నర్‌ వజూభాయ్‌ వాలా నిర్ణయం నేపథ్యంలో గోవా, మణిపుర్‌లో కాంగ్రెస్, బిహార్‌లో ఆర్జేడీ నేతలు ఆయా రాష్ట్రాల గవర్నర్లతో శుక్రవారం భేటీ అయ్యారు. బిహార్‌ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 80 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ నిలిచిన నేపథ్యంలో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ‘గవర్నర్‌ను కలసి మాకు 111 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉన్నట్లు లేఖను సమర్పించాం. వీరిలో ఆర్జేడీతో పాటు కాంగ్రెస్, హిందుస్తానీ అవామ్‌ మోర్చా(హెచ్‌ఏఎం), సీపీఐ(ఎంఎల్‌) పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ గవర్నర్‌ బలపరీక్షకు ఆదేశిస్తే మేం కచ్చితంగా విజయం సాధిస్తాం. ఎందుకంటే చాలామంది శాసనసభ్యులు మాకు అనుకూలంగా ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు’అని మీడియాకు తెలిపారు. ఏకైక పెద్దపార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న కర్ణాటక గవర్నర్‌ నిర్ణయం సరైనదైతే.. బిహార్‌లో ఆర్జేడీని కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందేనని స్పష్టం చేశారు. 243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీకి 2015లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లలో గెలుపొందగా, జేడీయూ 71 చోట్ల, బీజేపీ 53 చోట్ల, కాంగ్రెస్‌ 27 సీట్లలో గెలుపొందాయి. వీటితో పాటు ఎల్జేపీ, ఆర్‌ఎల్‌ఎస్పీ చెరో రెండు సీట్లను దక్కించుకున్నాయి. తొలుత ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జేడీయూ.. ఆ తర్వాత బీజేపీతో జట్టుకట్టింది.

మృదులా సిన్హాతో కాంగ్రెస్‌ భేటీ
గోవాలో అతిపెద్ద పార్టీగా నిలిచిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత చంద్రకాంత్‌ కవ్లేకర్‌ గోవా గవర్నర్‌ మృదులా సిన్హాను శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో కాంగ్రెస్‌ నేతలతో కలసి ఆమెకు లేఖను సమర్పించారు. 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం గవర్నర్‌కు పార్టీ రాసిన లేఖ ప్రతిని దీనికి జత చేశారు. తమ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏడు రోజుల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ ఈ లేఖలో తెలిపింది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న కర్ణాటక గవర్నర్‌ నిర్ణయం 2017లో గోవా గవర్నర్‌ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని రుజువు చేస్తోందని పేర్కొంది. 40 సీట్లున్న గోవా అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17 చోట్ల విజయం సాధించినా.. కేవలం 13 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ గోవా ఫార్వర్డ్‌ పార్టీ(3), మహరాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ(3), ముగ్గురు స్వతంత్రుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు మణిపుర్‌ మాజీ సీఎం ఇబోబీ సింగ్‌ నేతృత్వంలో 9 మంది కాంగ్రెస్‌ సీఎల్పీ నేతల బృందం శుక్రవారం ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్‌ జగదీశ్‌ ముఖితో రాజ్‌భవన్‌లో భేటీ అయింది. ఈ సందర్భంగా అసెంబ్లీలోని 60 స్థానాల్లో 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిల్చిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరినట్లు సింగ్‌ మీడియాకు తెలిపారు. గతేడాది జరిగిన మణిపుర్‌ అసెంబ్లీఎన్నికల్లో కాంగ్రెస్‌ 28 చోట్ల, బీజేపీ 21 సీట్లలో విజయం సాధించాయి. కానీ స్థానిక పార్టీల సాయంతో బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

                                       మృదులా సిన్హాకు లేఖ ఇస్తున్న కాంగ్రెస్‌ నేతలు

మరిన్ని వార్తలు