రాజీ లేని పోరు

28 May, 2018 08:56 IST|Sakshi
రాజరాజేశ్వరి నగర ఎన్నికలపై అంతటా ఉత్కంఠ నెలకొంది

కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ పోటాపోటీ  

అధికార పక్షాల మధ్య యుద్ధం

అసెంబ్లీలోను, అధికారంలోనూ మిత్రపక్షాలు, కానీ నేడు జరుగుతున్న రాజరాజేశ్వరి నగర నియోజకవర్గం ఎన్నికల్లో మాత్రం శత్రువులే. ఇక సత్తా చాటుకోవాలని బీజేపీ తహతహ. ఇలాంటి అనూహ్య పరిణామాల మధ్య జరిగే ఎన్నికల ఫలితం 31వ తేదీన తేలిపోతుంది.

యశవంతపుర: ఓటర్‌ కార్డుల కుంభకోణంతో వాయిదా పడిన బెంగళూరులోని రాజరాజేశ్వరినగర నియోజకవర్గానికి సోమవారం పోలింగ్‌ జరగనుంది. 421 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద గట్టి పోలీసు బందోబస్తును నియమించారు. శనివారం సాయంత్రంతో బహిరంగ ప్రచారం ముగిసింది. కాంగ్రెస్‌ నుంచి మునిరత్న, బీజేపీ నుండి తులసి మునిరాజుగౌడ, జేడీఎస్‌ నుంచి రామచంద్ర పోటీలో ఉన్నారు. వీరితో పాటు నటుడు హుచ్చ వెంకట్‌తో సహా పలువురు స్వతంత్రులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఇక్కడ కూడా పొత్తుతో పోటీ చేస్తాయని అందరూ భావించారు. కానీఅటువంటిదేమీ లేదని జేడీఎస్‌ తేల్చసింది.

దీంతో త్రిముఖ పోటీ ఖాయమైంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డీకే శివకుమార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరత్నకు మద్దతివ్వాలని కోరినా జేడీఎస్‌ నాయకులు పట్టించుకోలేదు. మాజీ ప్రధాని దేవేగౌడ రెండురోజుల పాటు ఆర్‌ఆర్‌ నగరలో జేడీఎస్‌ అభ్యర్థి రామచంద్ర తరఫున ప్రచారం చేసి గెలుపు తమ పార్టీదేనంటూ ప్రకటించారు. పొత్తు విధానసభా వరకేనని ప్రకటించడంతో ఇక్కడ పోటీ ఆసక్తిదాయకంగా మారింది. కుమారస్వామి కూటమి నుంచి ముఖ్యమంత్రి అయినా, జేడీఎస్‌ను గెలుపించుకొనే బాధ్యత తనదంటూ దేవేగౌడ స్పష్టంచేశారు. దీంతో మూడు పార్టీల మధ్య ఆర్‌ఆర్‌ నగరలో పోటీ తీవ్రంగా ఉంది. కాగా, 31వ తేదీన జ్ఞానాక్షి పాఠశాలలో ఓట్ల లెక్కింపు ఉంటుంది.

421 పోలింగ్‌ కేంద్రాలు
421 పోలింగ్‌ కేంద్రాల్లో సమస్యాత్మక కేంద్రాలు–4, అతి సమస్యాత్మకం–47, సాధారణం – 184 కేంద్రాలుగా గుర్తించారు.
పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది.
1261 మంది పోలింగ్‌ సిబ్బందితో సహా 2523 మంది పోలీసులు, ఇతర సిబ్బందిని నియమించారు.
ముందుజాగ్రత్తగా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వీడియోతో చిత్రీకరిస్తారు.
నియోజకవర్గం పరిధిలో సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
ఉద్యోగులు, ఓటర్లు అందరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నదే సెలవు ఉద్దేశం.

మరిన్ని వార్తలు