గులాబీ.. జోరు 

6 Jun, 2019 07:19 IST|Sakshi

పాలమూరు: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికార పార్టీ కావడంతో స్థానికంగానూ ఆ పార్టీ బలంగా ఉండాలని పల్లె ఓటర్లు భావించారు. గ్రామస్థాయిలో ఉన్న పటిష్ట క్యాడర్‌ ఆ పార్టీకి అదనపు బలం చేకూర్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వల్లెవేస్తూ.. గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని ముఖ్య నేతలు ప్రచారం చేయడం సత్ఫలితాలిచ్చింది. ముఖ్యంగా జిల్లాలో అన్నిచోట్లా ఎమ్మెల్యేలు ఆ పార్టీకి చెందినవారే కావడం, స్థానికంగానూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తేనే ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో ఓటర్లు వారికే మద్దతు పలికినట్లు తెలుస్తోంది. జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలను క్లీన్‌ స్వీప్‌ చేయడంతోపాటు అత్యధిక ఎంపీటీసీ స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టారు.

జిల్లాలో క్లీన్‌ స్వీప్‌.. 
మహబూబ్‌నగర్‌ జెడ్పీపీఠంపై మరోసారి గులాబీ జెండా ఎగిరింది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించిన జిల్లా పరిషత్‌లో తొలిసారి అధికార టీఆర్‌ఎస్‌ జెడ్పీచైర్మన్‌ పదవిని దక్కించుకుంది. జిల్లాలో మొత్తం 14కు 14 స్థానాలను క్లీన్‌ స్వీప్‌ చేస్తూ సత్తా చాటింది. ప్రస్తుత ఫలితాల్లో అన్ని మండలాల్లోనూ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది. గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలతో పోలిస్తే ఈ ఫలితాలు అధికార పార్టీని మరింత సంతృప్తినిచ్చాయి. పార్టీ ఇది వరకే తమ జెడ్పీచైర్మన్‌ అభ్యర్థిగా స్వర్ణమ్మను ప్రకటించడంతో ఆమె జడ్పీ చైర్మన్‌ కావడం లాంఛనమే. మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట సెగ్మెంట్లలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం ఆ పార్టీకి మరింత బలం చేకూర్చింది. అధినాయకత్వం అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేయగా.. జెడ్పీటీసీ, ఎంపీటీసీల విజయానికి మంత్రి శ్రీనివాస్‌గౌడు పెద్దన్న పాత్ర తీసుకొని ఇతర ఎమ్మెల్యేలను కలుపుకొని క్షేత్రస్థాయిలో చురుగ్గా సాగారు. ఫలితంగా 14 జెడ్పీటీసీ, 111 ఎంపీటీసీ స్థానాల్లో భారీ విజయం నమోదు చేశారు.

అన్నిచోట్లా ‘చే’జారాయి.. 
ప్చ్‌.. కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ ఓడింది. మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు నారాయణపేట జిల్లాలోనూ జెడ్పీటీసీ స్థానాలు కోల్పోయింది. మహబూబ్‌నగర్‌లో ఉన్న 14 జెడ్పీటీసీ స్థానాల్లో ఒక్కచోట కూడా ఖాతా తెరవలేకపోయింది. నారాయణపేట జిల్లాలో 11 జెడ్పీటీసీ స్థానాల్లో కేవలం మద్దూరు స్థానాన్ని మాత్రం దక్కించుకుంది. రెండు జిల్లాల్లో కలిపి 58 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకోగలిగింది. అధిష్టానం చిన్నచూపు, జిల్లాలో కాంగ్రెస్‌ నాయకుల మధ్య అంతర్గత విభేదాలతోపాటు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి ఓట్లను అభ్యర్థించడంలో వెనుకబడ్డారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మండలాల్లో సైతం టీఆర్‌ఎస్‌ పాగా వేసింది. కాంగ్రెస్‌ జెడ్పీటీసీ అభ్యర్థులు కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి జిల్లాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్య నాయకులు పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో స్థానిక ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి దయనీయంగా మారింది.

పట్టుబిగించని బీజేపీ 
జిల్లాలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ స్థానిక ఎన్నికల్లో మాత్రం పట్టుబిగించలేకపోయింది. ప్రాదేశిక ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం కావడం విశేషం. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14 జెడ్పీటీసీ స్థానాల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. ఇక 169 ఎంపీటీసీ స్థానాల్లో కేవలం 6 స్థానాల్లో విజయం సాధించింది. నారాయణపేట జిల్లాలో 11 జెడ్పీటీసీ స్థానాలకు గాను కేవలం ధన్వాడ జెడ్పీటీసీ స్థానం సొంతం చేసుకుంది. అలాగే 140 ఎంపీటీసీలో 25 స్థానాల్లో విజయం వరించింది. లోక్‌సభ ఎన్నికలతో పోల్చి చూడగా ఈసారి వచ్చిన ఓట్ల సంఖ్య చాలా వరకు తగ్గింది. స్థానిక నాయకులు కేంద్రం చేసే అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో వెనుకబడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్‌ లేకపోవడం కూడా ఒక కారణంగా అనిపిస్తోంది.

>
మరిన్ని వార్తలు