బీజేపీ నేతపై దాడి.. కాళ్లతో తన్నుతూ..

25 Nov, 2019 14:51 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి జై ప్రకాశ్‌ మజుందార్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన జియాఘాట్‌ ఇస్లాంపూర్‌ ప్రైమరీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద చోటు చేసుకుంది. పోలింగ్‌ బూత్‌ను సందర్శించేందుకు వెళ్లిన జైప్రకాశ్‌ మజుందార్‌పై తృణమూల్‌కార్యకర్తలు విరుచుపడ్డారు. పోలింగ్‌ బయట కాళ్లతో తన్నుతూ.. చెట్ల పొదలు ఉన్న మురికి కాలువలో తోసేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కార్యకర్తలను చెదరగొట్టారు.

కాగా, తనపై దాడికి యత్నించిన తృణమూల్‌ కార్యకర్తలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ప్రకాశ్‌ మజుందార్‌ డిమాండ్‌ చేశారు. తృణమూల్‌ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనడానికి ఈ దాడియే నిదర్శనమన్నారు. తృణమూల్‌ నేతలు వీధి రౌడిల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా తృణమూల్‌ నేతలు మాత్రం ఈ దాడిని తమ కార్యకర్తలు చేయలేదని చెప్పుకొచ్చారు. స్థానికులే బీజేపీపై ఆగ్రహంతో జైప్రకాశ్‌ ముజుందార్‌పై దాడి చేశారని పేర్కొన్నారు. 

 పశ్చిమ మిడ్నపూర్‌ జిల్లాలోని ఖరగ్‌పూర్‌ సదర్‌, నదియాలోని కరీంపూర్‌, ఉత్తర్‌ దినాజ్‌పూర్‌లోని కలియాగంజ్‌ నియోజక వర్గాలకు నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కలియాగంజ్‌ నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పపర్మతానాథ్‌ రాయ్‌ మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కరీంపూర్‌నుంచి ఎన్నికైన టిఎంసి ఎమ్మెల్యే మహువా మొయిత్రా, ఖరగ్‌పూర్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే దిలీప్‌ ఘోష్‌ లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది.

మరిన్ని వార్తలు