నాడు రాజ్యసభలో తెలుగు కోసం..!

29 Aug, 2018 12:49 IST|Sakshi

నందమూరి హరికృష్ణ తెలుగుభాషాభిమాని. తెలుగు భాషాదినోత్సవం రోజునే ఆయన మృతిచెందడంపై భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విజభన సందర్భంగా ఆయన రాజ్యసభలో తెలుగులో మాట్లాడేందుకు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. నాడు ఆయన రాజ్యసభలో చేసిన ప్రసంగాన్ని భాషాభిమానులు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.

నాడు రాజ్యసభలో...
రాజ్యసభలో తెలంగాణపై చర్చ సందర్భంగా.. తెలుగు ప్రజలను విడదీసే చర్చలో పాల్గొనడం బాధాకరం అని హరికృష్ణ తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టారు. అందుకు ఉపాధ్యక్షుడు కురియన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా అనుమతి లేనందున తెలుగులో మాట్లాడటం కుదరని చెప్పారు. ముందుగా అనుమతి కోరితే ట్రాన్స్‌లేటర్‌ను ఏర్పాటు చేసేవారమన్నారు.

ట్రాన్స్లేషన్ కాదు ఎక్స్ప్రెషన్ ముఖ్యమని హరికృష్ణ అన్నారు. తెలుగువాడిని కావడం వల్ల తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్టారు. తెలుగులో మాట్లాడటం తప్పుకాదు, ముందుగా చెప్పకపోవడం నిబంధనలకు విరుద్ధం అని ఉపాధ్యక్షుడు కురియన్ అభ్యంతరం చెప్పారు. మీరు ఏం మాట్లాడుతున్నారో తనకైనా అర్ధం కావాలని ఆయన అన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. బిజెపి సభ్యుడు వెంకయ్యనాయుడు కలుగజేసుకొని పలానా భాషలో మాట్లాడాలనే అధికారం అధ్యక్షునికి లేదని అన్నారు.

తెలుగులో మాట్లాడవద్దని ఉపాధ్యక్షుడు ఎంత అభ్యర్థించినా హరికృష్ణ మాత్రం తెలుగులోనే మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించి తాంబూళాలు ఇచ్చాం తన్నుకు చావండి అంటారా? అని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు