రేపటి బంగ్లా ఎన్నికలపై భారత దృష్టి

29 Dec, 2018 15:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌కు ఆదివారం నాడు జరుగుతున్న ఎన్నికలు ఆ దేశానికే కాకుండా భారత దేశానికి కూడా ముఖ్యమైనవే. 1971లో విమోచన యుద్ధం ద్వారా స్వాతంత్య్ర దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి బంగ్లాదేశ్‌కు సహజమైన మిత్ర దేశంగా ఉంటున్న భారత్‌కు మధ్య బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌ ఆర్థిక రంగంలో సాధించిన పురోగతి, సుస్థిరత రాజకీయ రంగంలో సాధించకపోవడం మాత్రం విచారకరమైన విషయమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే కాకుండా అట్టడుగు స్థాయిలో ఉండింది. 

గడిచిన దశాబ్దం నుంచి ఆ దేశం ఏటా ఆరు శాతానికిపైనే జీడీపీ వృద్ధి రేటును సాధిస్తూ వచ్చింది. 2017–18 సంవత్సరంలో ఏకంగా 7.86 శాతం వృద్ధి రేటును సాధించింది. బంగ్లా వస్త్ర వ్యాపారంలో ప్రపంచంలోనే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. చైనా తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రెండో దేశంగా కూడా గుర్తింపు పొందింది. ఒకప్పుడు వెనకబడిన దేశంగా బంగ్లాదేశ్‌ను పేర్కొన్న ఐక్యరాజ్య సమితి ఇప్పుడు దాన్ని అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశంగా వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్‌ తనకు అవసరమైన సరుకులను ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్న విదేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. దక్షిణాసియాలోనే భారత్‌కు బంగ్లా అతిపెద్ద వ్యాపార భాగస్వామి. ఇరు దేశాల మధ్య నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. 

ప్రజాస్వామ్యం అంతంత మాత్రమే 
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాలుగేళ్లకే దేశ వ్యవస్థాపక నాయకుడు షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ను హత్య చేసి సైన్యం అధికారంలోకి వచ్చింది. చాలాకాలం పాటు సైనిక నియంత పాలనే కొనసాగింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా కృషి చేయలేదు. గత పార్లమెంట్‌ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (ఇస్లాం పార్టీ) బహిష్కరించడంతో పాలకపక్ష అవామీ లీగ్‌ పార్టీ ఎలాంటి పోటీ లేకుండా సగానికి పైగా పార్లమెంట్‌ సీట్లను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో 38 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించుకుంది. అయితే వాస్తవానికి 22 శాతం మాత్రమే పోలింగ్‌ జరిగినట్లు స్వతంత్ర వర్గాలు పేర్కొన్నాయి. 

ప్రధానంగా ఎవరి మధ్య పోటీ
దేశానికి స్వాతంత్య్ర లభించినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో ప్రధానంగా రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటోంది. వాటిలో ప్రధానమైనది దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అవామీ లీగ్‌. సెక్యులర్‌ పార్టీగా గుర్తింపు పొందిన ఈ పార్టీకే మైనారీటీలైన హిందువులు, మెజారిటీలయిన బౌద్ధులు ఓటు వేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ వస్తున్నది బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ. ఇస్లాం సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఈ పార్టీ గత ఎన్నికలను బహిష్కరించడం వల్ల వరుసగా పదేళ్లపాటు షేక్‌ హసీనా నాయకత్వాన ఆవామీ లీగ్‌ పార్టీయే అధికారంలో ఉంది. ఈ కారణంగా కూడా ప్రజల్లో ఆమె పట్ల వ్యతిరేకత పెరిగింది. ప్రజాస్వామ్య పద్ధతులను తుంగలో తొక్కి ఆమె అణచివేత రాజకీయాలకు పాల్పడుతోందన్న విమర్శలు కూడా ఎక్కువే ఉన్నాయి. మాదక ద్రవ్యాలు, అవినీతిపై యుద్ధం పేరిట ఆమె తన రాజకీయ ప్రత్యర్థులందరిని దాదాపుగా మట్టుబెట్టారు.ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ చీఫ్‌ ఖలేదా జియాను అవినీతి ఆరోపణలపై జైలుకు పంపించారు. ఆ కారణంగా ప్రస్తుత ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది. తన ప్రభుత్వాన్ని విమర్శించినందుకు దేశంలో మంచి గుర్తింపున్న మీడియా ఫొటోగ్రాఫర్‌ షాహిదుల్‌ ఆలంను కూడా కటకటాల వెనక్కి నెట్టారు. 

భారత్‌ మద్దతు ఎవరికి ?
బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో ఆది నుంచి అవామీ లీగ్‌కే భారత్‌ లోపాయికారిగా మద్దతిస్తుండగా 2014 ఎన్నికల నుంచి బహిరంగంగా మద్దతివ్వడం ప్రారంభించింది. ఈ కారణంగానే షేక్‌ హసీనాతో భారత మైత్రి బలపడుతూ వచ్చింది. ఫలితంగా 2015లో ఇరు దేశాల మధ్య రెండు ప్రధాన ఒప్పందాలు కుదిరాయి. ఒకటి భూ సరిహద్దుకు సంబంధించిన ఒప్పందం కాగా, మరోటి అక్కడి భూభాగం మీది నుంచి పనిచేస్తున్న ‘యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం’ లాంటి భారత ఈశాన్య రాష్ట్రాల మిలిటెంట్‌ సంస్థలను సమూలంగా నిర్మూలించడం. ఈ రెండో ఒప్పందం కారణంగానే రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్‌ సైనికులు ఇచ్చిన సమాచారం మేరకు భారత సైనికులు బంగ్లా సరిహద్దుల్లోకి చొచ్చుకుపోయి అస్సాం మిలిటెంట్‌ నాయకులను కాల్చి వేశారు. ఈసారి కూడా అవామీ లీగ్‌కే భారత ప్రభుత్వం మద్దతిస్తోంది. 

ఇంతకీ ఎవరిదీ గెలుపు?
షేక్‌ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ను గట్టిగా ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పారీ ఈసారి 20 చిన్నా, చితక పార్టీలను కలుపుకొని ‘జాతీయ ఐక్య సంఘటన’ పేరిట పోటీకి రంగంలోకి దిగింది. ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత కూడా తమకు కలసి వస్తోందని జాతీయ ఐక్య సంఘటన భావిస్తోంది. ఈసారి ఇరు పక్షాల మధ్య పోటీ బలంగా ఉంటుందని, ఏ పక్షమైనా గెలవచ్చని ముందస్తు ఎన్నికల సర్వేలు సూచిస్తున్నాయి. అయితే ఈసారి కూడా ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగే అవకాశం లేనందున అవామీ లీగ్‌ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీడియా భావిస్తోంది. ఎన్నికల కమిషన్, పోలీసులు ప్రభుత్వం చేతుల్లో కీలు బొమ్మలయ్యాయని ప్రతిపక్ష అభ్యర్థులను అన్యాయంగా అభియోగాలు మోపి అరెస్ట్‌ చేయిస్తున్నారని ప్రతిపక్షం నాయకులు ఆరోపిస్తున్నారు. కేసులు, అరెస్ట్‌కారణంగా 17 పార్లమెంట్‌ సీట్లలో ప్రతిపక్షానికి అభ్యర్థులు లేకుండా పోయారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఫొటోలు గానీ వీడియోలుగానీ తీయరాదంటూ మీడియాపై ఆంక్షలు విధించినందున రిగ్గింగ్‌ జరిగే అవకాశం ఎక్కువ ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా