ఖండించిన మంత్రి వెలంపల్లి, మల్లాది విష్ణు

2 Feb, 2020 13:44 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: దేవాదాయ భూములను పవిత్ర భూములుగా భావించే ప్రభుత్వం తమదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. దేవాదాయ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. మంత్రి వెలంపల్లి ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. భీమిలీలో భూచోళ్లు అంటూ ఈనాడు దినపత్రిక అసత్య కథనాలు ప్రచురించిందని ఆయన మండిపడ్డారు. ఒక వార్త రాసేముందే పరిశీలించి ప్రచురించాలని ఆయన హితవు పలికారు. మీడియాలో తప్పుడు వార్తలు ప్రచురించడం సరికాదని, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల అమలు ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు.

‘భీమిలిలో దేవాలయ భూములపై తప్పుడు కథనాలు రాశారు. దేవాదాయ భూములను పవిత్రమైన భూములుగా భావిస్తాం. దేవాదాయ శాఖలో గజం స్థలం విక్రయించాలన్నా హైకోర్టు అనుమతి కావాలి. గత ప్రభుత్వం చేసినట్లు దేవాదాయ భూములను ధారాదత్తం చేయలేదు. గత ప్రభుత్వంలో మఠం భూములను ఇష్టారాజ్యంగా లీజుకు ఇచ్చేశారు. హధీరాంజీ మఠం భూములు దుర్వినియోగంపై చర్యలు తీసుకున్నాం. దేవాదాయ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం’  అని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.

బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అర్చక సంక్షేమ నిధులపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే అర్చక సంక్షేమ నిధులు ఖర్చు చేయాలని..ఆ విషయం తెలియకుండా తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. గతంలో టీడీపీ నేతలు పెన్షన్లను కూడా మింగేశారని ఆయన ధ్వజమెత్తారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. తమ ప్రభుత్వం పెన్షన్‌ డోర్‌ డెలివరీ చేసి లబ్ధిదారుల్లో ఆనందం నింపిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు.

చదవండి: 

‘చంద్రబాబు అడ్డొచ్చినా అభివృద్ధి ఆగదు’

>
మరిన్ని వార్తలు