పెన్షన్ల సొమ్ము 3 రెట్లు పెంపు

9 Jul, 2019 03:09 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

పెన్షన్ల కోసం ఈ ఏడాది  రూ.15,675 కోట్లు ఖర్చు చేస్తున్నాం

పెండింగ్‌లో ఉన్న 5.40 లక్షల  పెన్షన్లను మంజూరు చేస్తున్నాం  

లంచాలివ్వాల్సిన పనిలేదు

సెప్టెంబర్‌ 1 నుంచి సంక్షేమ పథకాలు డోర్‌ డెలివరీ

‘‘సమాజంలో ప్రతి కుటుంబం, ప్రతి ఊరు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం మనది. నవరత్నాల్లోని ప్రతి పథకం నిరుపేద కుటుంబాలకు మేలు చేసేదే. త్వరలోప్రారంభం కానున్న గ్రామ వలంటీర్లు,
గ్రామ సచివాలయాల వ్యవస్థతో ప్రతి రైతు కుటుంబానికి, ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చే దిశగా తొలి అడుగులు పడబోతున్నాయి’’  

‘‘ప్రభుత్వ పథకాలను ప్రజల ఇళ్లకు డోర్‌ డెలివరీ చేసే విషయంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతాలు చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం. చివరకు వారు ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా పట్టించుకోం. గతంలో మాకు ఓటు వేయని వారు కూడా మా పాలన చూసి ఎన్నికల్లో మాకు ఓటు వేసేలా సుపరిపాలన అందిస్తాం’’    

సాక్షి ప్రతినిధి కడప: చంద్రబాబు ప్రభుత్వం గత ఐదేళ్లలో పెన్షన్ల కోసం ఇచ్చిన సగటు సొమ్ము కంటే తాము మూడింతలు అధికంగా వ్యయం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో ‘రైతు దినోత్సవం’ సభలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురికి పెన్షన్లు ఇచ్చారు. పెన్షన్ల పెంపు, గ్రామ వలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల ఏర్పాటు వంటి పథకాలను తమ ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. రైతు దినోత్సవంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా ఏం చెప్పారంటే... 

మీ బిడ్డ, ఈ జిల్లా ముద్దుబిడ్డ అయిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కడప గడప నుంచే నవరత్నాలకు శ్రీకారం చుడుతున్నాం. నవరత్నాల్లో మొదటి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. నాలుగు నెలల క్రితం వరకు రూ.1,000 మాత్రమే ఉన్న పెన్షన్‌ను రూ.2,250కి పెంచాం. దివ్యాంగులకు రూ.3,000 పెన్షన్, డయాలసిస్‌(రక్తశుద్ధి) చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు రూ.10,000 పెన్షన్‌ ఇస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న అక్షరాలా 5.40 లక్షల పెన్షన్లను ఈ నెలలోనే మళ్లీ మంజూరు చేస్తున్నాం. ఇంకా పెన్షన్లు అందకుండా మిగిలిపోయిన అవ్వాతాతలు ఉంటే గ్రామ వలంటీర్ల ద్వారా, గ్రామ సచివాలయాల ద్వారా వారికి సంతృప్తికర స్థాయిలో మంచి చేయడానికి అడుగులు ముందుకేస్తాం. పెన్షన్ల కోసం చంద్రబాబు సర్కారు ఇచ్చిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. 

వలంటీర్‌ తప్పు చేస్తే తొలగింపే 
2,000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌ను(సచివాలయం) ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్‌ను నియమిస్తున్నాం. ఆ వలంటీర్‌ తన పరిధిలోని ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా డోర్‌ డెలివరీ చేస్తాడు. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచే ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ గ్రామ వలంటీర్లు లంచాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదనే వారికి నెలనెలా రూ.5,000 చొప్పున వేతనం ఇస్తున్నాం. ఏ గ్రామ వలంటీరైనా లంచాలు తీసుకున్నాడని, అన్ని అర్హతలు ఉన్న కూడా పింఛన్లు మంజూరు చేయలేదని భావిస్తే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం ఒక టెలిఫోన్‌ నెంబర్‌ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం.

తప్పు చేసిన సదరు వలంటీర్‌ను విధుల నుంచి తొలగిస్తాం.  జమ్మలమడుగులో రైతు దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, మంత్రులు కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వెంకటసుబ్బయ్య, మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు డీసీ గోవింద్‌రెడ్డి, కత్తి నరసింహారెడ్డి, సీఎం కార్యక్రమాల నిర్వహణ ఓఎస్‌డీ తలశిల రఘురాం, వైఎస్సార్‌సీపీ కడప, రాజంపేట పార్లమెంట్‌ అ«ధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

పెన్షన్లు కావాలంటే లంచాలు ఇవ్వక్కర్లేదు   
కడప జిల్లాకు నాలుగు నెలల క్రితం వరకు పెన్షన్ల కింద కేవలం రూ.32 కోట్లు ఇచ్చేవారు. ఇదే కడప జిల్లాకు ఇవాళ నెలకు పెన్షన్ల కింద అక్షరాలా రూ.73 కోట్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడి హయాంలో 2014–15లో అవ్వాతాతల పెన్షన్ల కోసం కేవలం రూ.3,378 కోట్లు ఖర్చు చేశారు. పెన్షన్ల కోసం చంద్రబాబు సర్కారు 2015–16లో రూ.5,221 కోట్లు, 2016–17లో రూ.5,270 కోట్లు, 2017–18లో రూ.5,436 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. 2018–19లో ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు డ్రామాలు ఆడుతూ పెన్షన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్ము రూ.8,234 కోట్లు మాత్రమే. మన ప్రభుత్వంలో పెన్షన్‌దారుల కోసం ఈ సంవత్సరం రూ.15,675 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇకపై గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాలు ఉండవు. పెన్షన్లు మంజూరు కావాలంటే లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కొట్టి, మీ పెన్షన్‌ను మీ చేతుల్లోనే పెట్టే రోజులు సెప్టెంబర్‌ ఒకటో తారీఖు నుంచే మొదలవుతాయి.

గండి ఆంజనేయునికి వస్త్రాల సమర్పణ

చక్రాయపేట : వైఎస్సార్‌ జిల్లా చక్రాయపేట మండలంలోని మారెళ్ల మడకలోని గండిక్షేత్రంలోని ఆంజనేయస్వామిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారి గురుప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు కేసరిస్వామి, ముఖ్య అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రి చేత ఆలయ అర్చకులు స్వామి వారికి విశేష పూజలు చేయించారు. అనంతరం ఆయనను ఆర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందించారు.  

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు గండిలో రూ.3.5 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆలయ పరిధిలో దక్షిణ రాజగోపుర నిర్మాణం, దక్షిణ ప్రాకార నిర్మాణం, డార్మెటరీతో పాటు ఆలయ పరిధిలో మరిన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. పులివెందులలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో తలపెట్టిన అరటి పరిశోధనా కేంద్రానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

బాగున్నావా పెద్దాయనా!
మాజీ ఎమ్మెల్యే కలిచెర్లకు సీఎం ఆత్మీయ పలకరింపు
సాక్షి ప్రతినిధి, కడప : హోదాలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా పెద్దలపట్ల ఆయనకున్న గౌరవం, ఆయన పలకరింపులోని ఆత్మీయత అక్కడున్న వారికెంతో ఊరటనిచ్చాయి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెకు చెందిన మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి వయసు రీత్యా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలవాలని ఆయన కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడికి విచ్చేసిన వైఎస్‌ జగన్‌.. వీల్‌చైర్‌లో కదలలేని స్థితిలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి వద్దకు వెళ్లి ‘బాగున్నావా పెద్దాయనా’ అంటూ మనువడిలా ఆత్మీయంగా పలకరించారు. ఆయన ఏదో చెప్పబోతుండగా.. తానే తలవంచి ఆయన చెప్పింది సావధానంగా విని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు