అక్టోబర్‌ నుంచి రైతు భరోసా: పుష్ప శ్రీవాణి

22 Jun, 2019 20:29 IST|Sakshi

సాక్షి, విశాఖ: అక్టోబర్‌ నుంచి రైతు భరోసా పథకం అమలు అవుతుందని  ఉపముఖ్యమంత్రి, గిరిజనశాఖ మంత్రి పుష్పశ్రీవాణి  తెలిపారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా కుల మత బేధాలు లేకుండా అందరకి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. పుట్టిన రోజు సందర్భంగా తొలిసారి ఆమె విశాఖలోని వైయ‌స్ఆర్‌ సీపీ కార్యాలయానికి వచ్చారు. వైఎస్సార్‌ సీపీ విశాఖ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను అరికడతామన్నారు. గతంలో గిరిజనులకు ఇచ్చిన మాట తప్పమని, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ, పార్టీ సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల, యతిరాజుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు విశాఖలోని ప్రేమ సమాజంలో మంత్రి పుష్ప శ్రీవాణి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. తన తొలి వేతనంలో 50 వేల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. మరోవైపు సొంత నియోజకవర్గం కురుపాంలో మంత్రికి ఘన స్వాగతం లభించింది. జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో పుష్ప శ్రీవాణి నివాసంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 300 కిలోల కేక్‌ను ఆమె కట్‌ చేశారు.

మరిన్ని వార్తలు