గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటరీ ఫలితాలపై కోర్టుకు..

28 May, 2019 02:07 IST|Sakshi
మోదుగుల , ఆళ్ల రామకృష్ణారెడ్డి

వైఎస్సార్‌ సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడి 

ఓట్ల లెక్కింపు పూర్తికాకుండానే ఫలితాలు వెల్లడించారని మండిపాటు 

ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో నేతల భేటీ

విజయవాడ సిటీ: గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్‌ సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకుండానే రిటర్నింగ్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారని వైఎస్సార్‌సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ రెండు లోక్‌సభ స్థానాల ఫలితాలపై కోర్టుకు వెళ్లనున్నట్టు ప్రకటించారు. తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియా పాయింట్‌లో సోమవారం వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు. పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించకుండానే ఫలితాలను ఏవిధంగా ప్రకటిస్తారని వారు ప్రశ్నించారు.

ఈ అంశాన్ని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్వోలు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బుధవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు. గుంటూరు పార్లమెంటరీ స్థానం పరిధిలో గుంటూరు వెస్ట్‌ సెగ్మెంట్‌ మినహా మిగిలిన ఆరు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించిందని మోదుగుల వివరించారు. ఈ ఆరు చోట్లా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు 53,731 ఓట్ల మెజార్టీ వచ్చిందన్నారు. తనకు మాత్రం తన ప్రత్యర్థి గల్లా జయదేవ్‌ కంటే 4,205 ఓట్లు తక్కువగా వచ్చాయని వివరించారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో సుమారు 9,700 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చెల్లనివిగా కౌంటింగ్‌ అధికారులు తేల్చి పక్కన పడేశారని, అందుకు కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడమే కారణంగా చెబుతున్నారని మండిపడ్డారు.


సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


కవర్‌లో ఉన్న పోస్టల్‌ బ్యాలెట్‌లో తప్పులు లేనప్పుడు అవి లెక్కించాలంటూ పట్టుబట్టినప్పటికీ అధికారులు అంగీకరించలేదన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం ఎంపీ స్థానంలోనూ అధికారుల తీరుతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. సిట్టింగ్‌ ఎంపీ కింజరపు రామ్మోహన్‌నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, టెక్కలి సెగ్మెంట్లలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారన్నారు. మిగిలిన చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించిందన్నారు. అంతేకాకుండా పలుచోట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం ఉద్యోగులు చేసిన పొరపాట్ల వల్ల పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లుబాటుకాకుండా పోయాయన్నారు.

మరిన్ని వార్తలు