ఎక్కడ చూసినా వారి మాటే! 

30 May, 2019 04:40 IST|Sakshi
బాపట్ల ఎంపీ నందిగం సురేష్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య

దేశం దృష్టిని ఆకర్షించిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు 

సామాన్యులతో అసామాన్య విజయం సాధించిన వైఎస్‌ జగన్‌పై ప్రశంసల వెల్లువ 

ప్రభుత్వోద్యోగులు, పోలీసు అధికారి, బీపీఎల్‌ కార్డుదారులు, ఉపాధ్యాయురాలు ఎంపీలుగా గెలుపొందడంపై హర్షాతిరేకాలు 

గోరంట్ల మాధవ్, గొడ్డేటి మాధవి, నందిగం సురేష్, రంగయ్యలపై జాతీయ మీడియా ప్రత్యేక కథనాలు 

సాక్షి, న్యూఢిల్లీ :  ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఇప్పుడు యావత్తు దేశం దృష్టిని ఆకర్షించారు. పార్టీకి చెందిన సామాన్య కార్యకర్తలు, ప్రభుత్వోద్యోగులు, ఓ పోలీసు అధికారి, ఉపాధ్యయురాలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీచేసి గెలవడంపై సామాజిక మాధ్యమాలు, జాతీయ మీడియా చానళ్లలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సీట్ల కేటాయింపులో సామాన్యులకు ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో వారందరినీ గెలిపించుకున్నారు. వారిలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎన్నికల ముందు వరకు బాధ్యతలు నిర్వర్తించి ఇప్పుడు హిందూపురం ఎంపీగా ఎన్నికైన గోరంట్ల మాధవ్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా పనిచేస్తూ అరకు ఎంపీగా ఎన్నికైన గొడ్డేటి మాధవి, పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ బీపీఎల్‌ కార్డుదారుడైన బాపట్ల ఎంపీ నందిగం సురేష్, గ్రూప్‌–1 అధికారిగా పనిచేసి అనంతపురం ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన పీడీ రంగయ్య దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. వీరిపై పలు జాతీయ మీడియా సంస్థలు  ప్రత్యేక కథనాల్ని ప్రసారం చేశాయి, ప్రచురించాయి.  

పోలీస్‌స్టేషన్‌ టు పార్లమెంట్‌ వయా హిందూపురం.. 
హిందూపురం ఎంపీగా గెలుపొందిన గోరంట్ల మాధవ్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన మాధవ్‌ ఎన్నికల్లో విజయం సాధించడంతో.. ‘పోలీస్‌స్టేషన్‌ టు పార్లమెంట్‌ వయా హిందూపురం’ అంటూ ఆయన విజయాన్ని కీర్తిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద హిందూపురం ఎంపీగా గెలుపొందిన గోరంట్ల మాధవ్‌ను డీఎస్పీ సెల్యూట్‌ చేస్తున్న ఫొటో ఒకటి దేశవ్యాప్తంగా వైరల్‌ అయ్యింది. అప్పటి వరకు సీఐగా పనిచేసిన మాధవ్‌ ఎంపీగా ఎన్నికవ్వడంతో డీఎస్పీ సెల్యూట్‌ చేశారంటూ ముందు అందరూ భావించారు. అయితే, తానే ముందు డీఎస్పీకి సెల్యూట్‌ చేశానని గోరంట్ల మాధవ్‌ తెలిపారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాలనే కాకుండా జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. దీనిపై ‘ద వీక్, న్యూస్‌ మినిట్స్, స్కూప్‌వూవ్, యూఎన్‌ఐ, రాజ్‌కాజ్‌ న్యూస్, ఔట్‌లుక్, బిజినెస్‌ టుడే, మనీకంట్రోల్, ఒడిశా, కర్ణాటక, హిందీ వెబ్‌సైట్లు ప్రత్యేక కథనాలు రాశాయి. 2019 ఎన్నికల్లో సామాన్యులు ఎంపీలుగా విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెడుతుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  

రెండో అతిపిన్న వయస్కురాలిగా మాధవి 
మరోవైపు.. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా పనిచేసి విశాఖ జిల్లా అరకు నుంచి ఎంపీగా గెలుపొందిన గొడ్డేటి మాధవి.. దేశవ్యాప్తంగా ఎన్నికైన ఎంపీలలో రెండో అతిపిన్న వయస్సురాలి (26 ఏళ్లు)గా రికార్డులకెక్కారు. ఆమె కేంద్ర మాజీమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌పై 2.20 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఒడిశాలో బీజేడీ నుంచి 25 ఏళ్లకే ఎంపీగా గెలుపొందిన చంద్రాణి ముర్ము పిన్న వయస్కురాలి (25ఏళ్లు)గా మొదటి స్థానంలో ఉన్నారు.  

పవర్‌ ఆఫ్‌ డెమోక్రసీ.. 
ఇక బాపట్ల రిజర్వుడ్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నందిగం సురేష్‌ అందరి దృష్టినీ ప్రత్యేకంగా ఆకర్షించారు. పార్టీలో సామాన్య కార్యకర్తలా పనిచేస్తూ బీపీఎల్‌ కార్డుదారుడైన సురేష్‌.. బాపట్ల నుంచి టీడీపీ సిట్టింగ్‌ ఎంపీని ఓడించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సురేష్‌ గెలుపును ‘పవర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’గా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా అభివర్ణించింది. అలాగే, ఒక ప్రభుత్వోద్యోగిగా డీఆర్‌డీఏలో పీడీగా పనిచేసిన తలారి రంగయ్య అనంతపురం నుంచి, పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి చిత్తూరు ఎంపీగా రెడ్డప్పలాంటి సామాన్యులు గెలుపొందడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా.. ఏపీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన వారిలో 88 శాతం మంది ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్న పార్టీగా వైఎస్సార్‌సీపీ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సాధించింది. ఇలా ఉన్నత విద్యార్హతలు, సామాన్యులకు పెద్దపీట వేస్తూ సీట్లు కేటాయించడమే కాకుండా వారిని ఎన్నికల్లో గెలిపించుకున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను అన్ని వర్గాల ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఎంపీలుగా గెలిచిన సామాన్యులు పార్లమెంటులో తమ ప్రత్యేకతను చాటుకోనున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు