కంప్యూటర్‌ విద్య అంతేనా?

5 Feb, 2018 16:09 IST|Sakshi
కంప్యూటర్‌ నేర్చుకుంటున్న విద్యార్థులు (ఫైల్‌)

 కాగితాలపై కంప్యూటర్ల లెక్కలు

 బోధకులు లేరు.. విభాగ బాధ్యులు లేరు..

 లేని విద్యకు లేటెస్ట్‌గా కీబోర్డులు

సిరిసిల్లఎడ్యుకేషన్‌: కాలానికనుగుణంగా సాధారణ విద్యతోపాటు కంప్యూటర్‌ విద్యనందుకోవాల్సిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కంప్యూటర్‌ విద్యాబోధనకు దూరమయ్యారు. గతంలో పలు సంస్థలు కంప్యూటర్‌ విద్యను ప్రభుత్వ పాఠశాలలో బోధన చేశాయి. వాటి ఒప్పంద గడువు తీరడమో..ప్రభుత్వం వారికి అవకాశం ఇవ్వకపోవడమే తెలియదు కానీ ఎలాగోలా పాఠశాలలో గతంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌లన్నీ నేడు బూజుపట్టాయి. విద్యను బోధించడానికి అవసరమైన బోధనకులను విద్యాశాఖ గౌరవవేతనం ఇచ్చి నియమించినా పరిస్థితి ఈ విద్యాసంవత్సరం లేదు.

902 కంప్యూటర్స్‌ వృథా..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యనందించడానికి గతంలో పలు సంస్థలు ముందుకువచ్చాయి. జిల్లాలో 82 పాఠశాలలో కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఉండగా, ఒక్కో ల్యాబ్‌లో 11 కంప్యూటర్స్‌ కలిపి 902 కంప్యూటర్స్‌ అందుబాటులో ఉన్నట్లు గణాంకాలున్నాయి. సిబ్బంది లేకపోవడంతో మూలనపడ్డాయి. టీచర్లే బోధన చేసేందుకు సిద్ధం అయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని అవసరమైన 223 కొత్త కీబోర్డులు, 102 మౌస్‌లను 48 పాఠశాలలకు విద్యాశాఖాధికారులు అందించారు.

కంప్యూటర్‌ ఇన్స్‌స్ట్రక్టర్స్‌ ఎక్కడా..?
ప్రస్తుత సీసీఈ విధానంతో ఉన్న రికార్డులు, పరీక్షల నిర్వహణ, ప్రయోగాలు చేయడానికే సమయం లేదంటే మళ్లీ కంప్యూటర్‌ విద్యను బోధించడం సాధ్యం కాదనే అభిప్రాయాలున్నాయి. గతంలో ఎన్‌ఐఐటీ వాళ్లకు కంప్యూటర్‌ విద్య అందించడానికి ఇచ్చిన విధానం మాదిరి మళ్లీ ఏదేని సంస్థతో కంప్యూటర్‌ విద్యను అందించేందుకు విద్యాసంవత్సరం ఆరంభంలో చేయాలని సూచిస్తున్నారు.

కాకిలెక్కలు..
ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కలిపి 82 సెంటర్లు ఉన్నాయని గణాం కాలున్నాయి. ప్రస్తుతం కాగితాలపై 902 కంప్యూటర్స్‌ ఉన్నాయన్న గణాంకాలుంటే క్షేత్రస్థాయి పరిశీలనలో మాత్రం 50 పాఠశాలలో కంప్యూటర్స్‌ కేంద్రాలుండగా ఒక్కో దానిలో 11 చొప్పున 550 కంప్యూటర్స్‌ ఉన్నట్లు ఆయా పాఠశాలల నిర్వాహకులు చెబుతున్నారు.

పరికరాలు వచ్చిన మాట వాస్తవమే
కంప్యూటర్లకు అవసరమైన కొన్ని పరికరాలు వచ్చిన మాట వాస్తవమే. అవసరమైన వాటికి వాడాలని పంపిణీ జరిగింది. బోధన చేయడానికి ప్రస్తుతం ప్రత్యేక శిక్షకులు లేరు. మన జిల్లాలోనే కాదు అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి. డిజిటల్‌ పాఠాలను చెప్పే క్రమంలో ఉపాధ్యాయులకు కొంత శిక్షణ అందింది. వారే ప్రస్తుతం బోధన చేస్తున్నారు. సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తాం.
– డాక్టర్‌ రాధకిషన్, డీఈవో, రాజన్న సిరిసిల్ల 

మరిన్ని వార్తలు