రహస్య విధానంలోనే ఇంటి వద్ద ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

రహస్య విధానంలోనే ఇంటి వద్ద ఓటింగ్‌

Published Sat, Nov 18 2023 1:32 AM

పోలింగ్‌ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌  - Sakshi

సిరిసిల్ల: ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఇంటి వద్ద ఓటింగ్‌ను రహస్య విధానంలో నిర్వహించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఎన్నికల సిబ్బందికి శిక్షణనిచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారికి ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం తొలిసారి కల్పించిందని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పోలింగ్‌ జరుగుతుందని వివరించారు. ఒక్కో బృందంలో పోలింగ్‌ అధికారి, అదనపు పోలింగ్‌ అధికారి, మైక్రో అబ్జర్వర్‌, పోలీస్‌ సిబ్బంది, వీడియోగ్రాఫర్‌ ఉంటారని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లను నిర్ణీత పద్ధతి ప్రకారం అనుమతిస్తారన్నారు. పోలింగ్‌ కేంద్రంలో చేసిన మాదిరే ఓటింగ్‌ ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని సూచించారు. అధికారిక వాహనంలోనే వెళ్లి హోం ఓటింగ్‌ విధులు నిర్వర్తించాలన్నారు.

ఎన్నికల విధుల్లో ఉన్న వారికి..

ఎన్నికల విధుల్లో ఉండి ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని సిబ్బందికి జిల్లా కేంద్రంలోని గీతానగర్‌ జెడ్పీ హైస్కూల్‌, వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈనెల 21, 22, 25 తేదీలలో ట్రైనింగ్‌ జరిగే వేదికల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సేవల సిబ్బందికి ఈనెల 25న రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. అంతకుముందు మాస్టర్‌ ట్రైనర్‌ శ్రీనివాసరెడ్డి పీవోలు, ఓపీవోలు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణనిచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ జిల్లా నోడల్‌ అధికారి పి.లక్ష్మీరాజం, సీపీవో పి.బి.శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ కేంద్రాలు పరిశీలన

పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బంది శిక్షణకు ఎంపిక చేసిన కేంద్రాలను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి శుక్రవారం పరిశీలించారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అగ్రహారం ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని గీతానగర్‌ జెడ్పీ హైస్కూల్‌లో శిక్షణ ఉంటుంది. అనంతరం సిరిసిల్ల తహసీల్దార్‌ ఆఫీస్‌లో కలెక్టర్‌ సమీక్షించారు. రిటర్నింగ్‌ అధికారులు ఆనంద్‌కుమార్‌, మధుసూదన్‌, శిక్షణ కార్యక్రమాల నోడల్‌ అధికారి పీబీ శ్రీనివాసాచారి ఉన్నారు.

21 నుంచి 25 వరకు అవకాశం

కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement
Advertisement