గుర్తుంచుకోండి.. అందరం టీ కప్పు లాంటి వాళ్లమే

19 Jan, 2020 14:30 IST|Sakshi

మహీంద్రా గ్రూఫ్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా తనకు తెలిసిన ఏ విషయాన్నైనా ట్విటర్‌ ద్వారా తెలియజేయడంతో ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ట్విటర్‌ ద్వారా సందేశాత్మక, సామాజిక ఇతివృత్తంతో కూడుకున్న వీడియోలను షేర్‌ చేసి ఎన్నో సార్లు నెటిజన్ల మనసులు గెలుచుకున్నారు. తాజాగా మహీంద్రా షేర్‌ చేసిన రెండు నిమిషాల 20 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి  మాట్లాడుతూ.. సమాజంలో మీరు ఏ స్థానంలో ఉన్నారనే దానికంటే వినయంగా ఉండడమే గొప్ప అని పేర్కొన్నాడు. మహీంద్రాకు ఆయన మాటలు విపరీతంగా నచ్చడంతో వెంటనే ఆ వీడియోనూ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో పాటు కాప్షన్‌ కూడా జత చేశారు.

'ఎవరైనా సరే వారు ఉన్న రంగంలో ఉన్నతస్థానానికి చేరుకున్నప్పుడు అదే  వినయంతో ఉండటం సులభమైన విషయం కాదు. మీరు ఆ స్థానంలో ఉండి వినయం నేర్చుకోవాలనుకుంటే మాత్రం అది చాలా క్లిష్టంగా కనిపిస్తుంది. నేను షేర్‌ చేసిన వీడియోలో నాకు అది కనిపించింది. వీడియోలో ఆ వ్యక్తి  ఉన్నతస్థానం చేరుకున్నా తన వినయం మాత్రం వదలిపెట్టలేదు. అందుకే మనందరం ఒక టీ కప్పు లాంటి వాళ్లం  అని అందరూ గుర్తుంచుకోండి. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా.. అది ఎప్పుడో ఒకప్పుడు మనల్ని వదిలివెళ్లిపోతుంది. కప్పు టీ మాత్రం మనతో పాటే ఉండిపోతుందంటూ' మహీంద్రా ట్వీట్‌ చేశారు.ప్రసుత్తం ఈ వీడియో వైరల్‌గా మారింది. మహీంద్రా చెప్పింది అక్షరాల నిజమేనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే కొన్ని రోజల క్రితం మహీంద్రా తన కంపెనీలో ఒక వ్యక్తి పదవీ విరమణ చేసినప్పుడు ట్విటర్‌ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ' క్షమించండి..సత్యవాచన్‌.. మీరు పదవి విరమణ చేసిన సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. 33 ఏళ్లు మా కంపెనీలో పని చేశారు. మీరు పనిపై చూపించిన ప్రేమను మేం ఎప్పటికి గుర్తుంచుకుంటాం. రిటైరైన తర్వాత కూడా మీ జీవితాన్ని హాయిగా గడపాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అంటూ ట్వీట్‌ చేశారు. అయితే  మహీంద్రా ట్వీట్‌కు సత్యవాచన్‌ కుమారుడు రీట్వీట్‌ చేస్తూ ' థాంక్యూ సార్‌ ! ఒక కంపెనీ యజమానిగా నా తండ్రిని ఒక కొలీగ్‌గా గుర్తించారు. మహీంద్రా ఫ్యామిలీలో మేము ఒక భాగమని చెప్పినందుకు కృతజ్ఞతలు. ఇది మీలాంటి వాళ్లకే సాధ్యమవుతుందంటూ' భావోద్వేగంతో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు