టెన్నిస్ అందుబాటులో ఉన్న స్వర్ణాలు 5

29 Jul, 2016 00:21 IST|Sakshi
టెన్నిస్ అందుబాటులో ఉన్న స్వర్ణాలు 5

ఖేల్  కహానీ


ఒలింపిక్స్ (ఏథెన్స్ 1896) శ్రీకారం నుంచే టెన్నిస్ కూడా ఉంది.  పురుషుల ఈవెంట్ జరిగిన నాలుగేళ్లకు (పారిస్-1900) మహిళల పోరు మొదలైంది. ఇరు విభాగాల్లో సింగిల్స్, డబుల్స్‌లతో పాటు ఇద్దరు కలిసి ఆడే మిక్స్‌డ్ డబుల్స్ విభాగం ఉంటుంది. అయితే మధ్యలో కొంతకాలం అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్), ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)ల మధ్య విభేదాలతో మొత్తం మీద 11 ఒలింపిక్స్‌ల్లో టెన్నిస్ జరగలేదు. 1896 నుంచి 1924 వరకు వరుసగా ఏడు ఒలింపిక్స్‌లో భాగమైన టెన్ని స్... అనంతరం జరిగిన ఎనిమిది ఒలింపిక్స్ (మొదట 1928 నుంచి 1964 వరకు, తర్వాత 1972 నుంచి 1980 వరకు)కు దూరమైంది. ఇక 1984 నుంచి మాత్రం స్థిరంగా చోటుదక్కించుకుంది.


2004 ఏథెన్స్ ఒలింపిక్స్ నుంచి ఇప్పటి వరకు ఇందులో ఆడేందుకు ర్యాంకింగే అర్హత. ఏటీపీ ర్యాంకుల జాబితా ప్రకారం పురుషులు, డబ్ల్యూటీఏ ర్యాంకుల ద్వారా మహిళలు ఇందులో తలపడేందుకు అర్హత సంపాదిస్తారు. టాప్-56 ర్యాంకింగ్స్‌వున్న క్రీడాకారులు ఇందులో ఆడతారు. డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్‌లో మాత్రం టాప్-10లో నిలిచిన ప్లేయర్లే వారికిష్టం వచ్చి న వారితో జతగా బరిలోకి దిగే అవకాశముంది. అనాది నుంచి ఇందు లో అమెరికా, బ్రిటన్ ప్లేయర్ల దే ఆధిపత్యం.. అగ్రస్థానం..! ఒలింపిక్స్ చరిత్ర లో అమెరికా 20 స్వర్ణాలు గెలిస్తే, బ్రిటన్ 17 చేజిక్కించుకుంది. అమెరికన్ సిస్టర్స్ సెరెనా, వీనస్‌లది ఇందులో అద్వితీయ రికార్డు. ఇద్దరు చెరో నాలుగు స్వర్ణాలతో రికార్డుల్లో కెక్కారు.

 
భారత్ నుంచి మూడు విభాగాల్లో

టెన్నిస్‌లో భారత్ గెలిచింది ఒకే ఒక్క పతకం. లియాండర్ పేస్ 1996లో పురుషుల సింగిల్స్‌లో కాంస్యం సాధించాడు. ఈ సారి భారత్ తరఫున నలుగురు రియోకు వెళ్లనున్నారు. సానియా మహిళల డబుల్స్‌లో ప్రార్థన  తోంబ్రేతో, మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి ఆడనుంది. పేస్... రోహన్ బోపన్నతో జతగా పురుషుల డబుల్స్ బరిలోకి దిగనున్నాడు. అలుపెరగని పేస్‌కిది వరుసగా ఏడో ఒలింపిక్స్. విశ్వ క్రీడల చరిత్రలో ఈ ఘనత సాధించనున్న తొలి భారత ఆటగాడు పేస్.

 
స్టెఫీగ్రాఫ్ ఘనత

టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు ఒక్కసారైనా గెలిస్తే కెరీర్ స్లామ్ సాధించినట్లు. ఒకే ఏడాది సాధిస్తే క్యాలెండర్ స్లామ్. ఒలింపిక్స్ స్వర్ణంతో పాటు నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఎవరైనా సాధిస్తే దానిని గోల్డెన్ స్లామ్ అంటారు. ఒకే ఏడాదిలో గోల్డెన్‌స్లామ్ సాధించిన ఒకే ఒక్క క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్. 1988లో ఈ జర్మనీ దిగ్గజం ఈ ఘనత సాధించింది.

 

>
మరిన్ని వార్తలు