కెప్టెన్గా ఇదే చివరి సిరీసా?

8 Nov, 2016 12:54 IST|Sakshi
కెప్టెన్గా ఇదే చివరి సిరీసా?

రాజ్కోట్:భారత్తో జరిగే ఐదు టెస్టుల సిరీస్తో ఇంగ్లండ్ టెస్టు జట్టుకు అత్యధిక మ్యాచ్లకు సారథిగా వ్యవహరించిన ఘనతను సొంతం చేసుకోబోతున్న అలెస్టర్ కుక్..ఈ సిరీస్ తరువాత ఇంగ్లండ్ కెప్టెన్సీ పగ్గాలను వదిలి పెట్టబోతున్నాడా? అంటే అవుననే వినిపిస్తోంది. ఈ మేరకు అలెస్టర్ కుక్ తాజాగా చేసిన వ్యాఖ్యలే అందుకు బలాన్నిస్తున్నాయి. భారత్తో సిరీస్ తరువాత తాను కేవలం ఓపెనర్గానే జట్టులో కొనసాగుతాననే సంకేతాలను ఇచ్చాడు. తాను టెస్టు కెరీర్ను యాథావిధిగా కొనసాగించాలనుకుంటున్నానని, అదే సమయంలో ఓపెనర్గా తన ఆటను కొనసాగిస్తానని చెప్పాడు. అయితే ఇక్కడ తన కెప్టెన్సీకి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలను కుక్ చేయలేదు. దాంతో భారత్ తో సిరీస్ అతనికి కెప్టెన్ గా చివరి సిరీస్ కావొచ్చని భావిస్తున్నారు.

2012లో ఇంగ్లండ్ జట్టుకు కుక్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అదే ఏడాది భారత్ తో జరిగిన టెస్టు సిరీస్ ను ఇంగ్లండ్ 2-1 తో గెలుచుకుంది. ఇప్పటివరకూ కుక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 24 టెస్టులను గెలిచింది. అదే క్రమంలో రెండు  యాషెస్ సిరీస్లను కూడా ఇంగ్లండ్ జట్టు కుక్ సారథ్యంలో సొంతం చేసుకుంది. 2006లో భారత్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ టెస్టు కెరీర్ను ఆరంభించిన కుక్.. అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పటివరకూ 135 టెస్టులు ఆడిన కుక్.. 10, 688 పరుగులను సాధించి ఈ ఫార్మాట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.
 

>
మరిన్ని వార్తలు