‘400 నాటౌట్‌.. 434 ఛేజింగ్‌ చూశా’

12 Dec, 2019 12:53 IST|Sakshi

పెర్త్‌:  పాకిస్తాన్‌కు చెందిన అంపైర్‌ అలీమ్‌ దార్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రికార్డును అలీమ్‌ దార్‌ తన పేరిట లిఖించుకున్నారు. తద్వారా ఇప్పటివరకూ వెస్టిండీస్‌ అంపైర్‌ స్టీవ్‌ బక్నర్‌ పేరిట ఉన్న అత్యధిక టెస్టు మ్యాచ్‌ల అంపైరింగ్‌ రికార్డును అలీమ్‌ దార్‌ బ్రేక్‌ చేశారు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు అంపైర్‌గా చేయడం ద్వారా అలీమ్‌ దార్‌ ఈ రికార్డును నెలకొల్పారు. 207 వన్డేలకు, 46 అంతర్జాతీయ టీ20లకు అంపైర్‌గా పని చేసిన అలీమ్‌ దార్‌కు ఇది 129వ టెస్టు మ్యాచ్‌ అంపైరింగ్‌ కావడం విశేషం. 1989-2009 మధ్య కాలంలో బక్నర్‌ 128 టెస్టులకు 181 వన్డేలకు అంపైర్‌గా పని చేశారు. కాగా, వన్డేల్లో అంపైరింగ్‌ రికార్డును అందుకోవడానికి ఇంకా రెండు మ్యాచ్‌లు దూరంలో ఉన్నారు దార్‌. దక్షిణాఫ్రికాకు చెందిన రూడీ కోర్టెజన్‌ 209 వన్డేలకు అంపైర్‌గా చేసి తొలి స్థానంలో ఉన్నారు.

పాకిస్తాన్‌లో దశాబ్దానికి పైగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడిన 51 ఏళ్ల అలీమ్‌ దార్‌.. తన ఆన్‌ ఫీల్డ్‌ అంపైరింగ్‌ కెరీర్‌ను 2003లో ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఢాకాలో జరిగిన మ్యాచ్‌ ద్వారా ఆరంభించారు. తన తాజా ఘనతపై అలీమ్‌ దార్‌ మాట్లాడుతూ.. ‘  నేను అంపైరింగ్‌ కెరీర్‌ మొదలుపెట్టే సమయానికి నేను దీన్ని సాధిస్తానని అనుకోలేదు. ఇది నా అంపైరింగ్‌ కెరీర్‌లో ఒక మైలురాయి. ఎన్నోవేల మైళ్ల ప్రయాణంలో ఇదొక తీపి జ్ఞాపకం. నా ప్రయాణంలో ఎన్నో ఘనతలు చూశా. టెస్టు ఫార్మాట్‌లో బ్రియాన్‌ లారా అజేయంగా 400 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో పాటు 2006లొ ఆస్ట్రేలియా నిర్దేశించిన 434 పరుగుల వన్డే లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేజింగ్‌ చేయడం కూడా చూశా’ అని అలీమ్‌ దార్‌ ఆనందం వ్యక్తం చేశారు.


మరిన్ని వార్తలు