ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ!

13 Jul, 2018 12:19 IST|Sakshi
ఇంగ్లండ్‌ ఆటగాళ్లు

నాటింగ్‌హామ్‌ : మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్లుంది ఇంగ్లండ్‌ జట్టు పరిస్థితి. ఇప్పటికే సొంత గడ్డపై భారత్‌తో టీ20 సిరీస్‌ కోల్పోయి.. తొలి వన్డే ఓడి కష్టాల్లో ఉన్న ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ హేల్స్‌ గాయంతో వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. పక్కటెముకల పట్టేయడంతో తొలి వన్డేకు దూరమైన హేల్స్‌.. నాలుగు వారాలు విశ్రాంతి కావాలని డాక్టర్లు సూచించడంతో ఈ సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు.

ఇక భారత్‌పై రెండో టీ20లో హాఫ్‌ సెంచరీ సాధించి హేల్స్‌ ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. భారత్‌పై మంచి ఫామ్‌ ఉన్న హేల్స్‌ దూరమవ్వడం ఆ జట్టును కలవరపాటు గురిచేస్తోంది. ఇక ఆస్ట్రేలియాతో  జరిగిన వన్డే సిరీస్‌లో సైతం హేల్స్‌(147) అద్బుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. హేల్స్‌ స్థానంలో డేవిడ్‌ మలాన్‌ తుది జట్టులోకి వచ్చాడు.

గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత కుల్దీప్‌ 6 వికెట్లతో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ పతనాన్ని శాసించగా.. రోహిత్‌ శర్మ సెంచరీతో బౌలర్లను ఆడుకున్నాడు. దీంతో భారత్‌ విజయం సులువైంది.

మరిన్ని వార్తలు