అండర్సన్‌ సారీ చెప్పాడు!

2 Aug, 2019 16:08 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్లకు యాషెస్‌ సిరీస్‌ అంటే ఎంతో ప్రతిష్టాత్మకం. దాంతో ఈ సిరీస్‌కు ఇరు జట్లు పూర్తి స్థాయి జట్లతో బరిలోకి దిగుతాయి. ఒకవేళ కీలక క్రికెటర్‌ ఎవరైనా యాషెస్‌ సిరీస్‌కు దూరమైతే ఇరు జట్లు ఏదో కోల్పోయినట్లు భావిస్తాయి. ఇప్పుడు ఇంగ్లండ్‌ అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. గురువారం ఎడ్‌బస్టన్‌ వేదికగా ఆరంభమైన తొలి టెస్టుకు ఇంగ్లండ్‌ ప్రధాన పేస్‌ ఆయుధం జేమ్స్‌ అండర్సన్‌ అర్థాంతరంగా వైదొలిగాడు. కేవలం నాలుగు ఓవర్లపాటు బౌలింగ్‌ మాత్రమే వేసిన అండర్సన్‌ కాలిపిక్క గాయంతో డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యాడు. తొలి టెస్టులో భాగంగా లంచ్‌కు వెళ్లిన సమయంలో అండర్సన్‌కు స్కానింగ్‌ నిర్వహించగా అతను కొన్ని వారాల పాటు జట్టుకు దూరం కావాల్సి వస్తుంది.

మొదటి టెస్టు మ్యాచ్‌లో అండర్సన్‌ గాయం తిరగబెట్టడంతో చేసేదేలేక ప్రేక్షక పాత్ర పోషించాడు. ఒకవైపు సహచరడు స్టువర్ట్‌ బ్రాడ్‌ చెలరేగిపోతుంటే అండర్సన్‌ మాత్రం బౌలింగ్‌కు దూరమయ్యాడు. అదే సమయంలో ఇంగ్లండ్‌ బౌలింగ్‌ యూనిట్‌కు అండర్సన్‌ క్షమాపణలు తెలియజేశాడని బ్రాడ్‌ పేర్కొన్నాడు. ‘ జట్టుకు దూరమైనందుకు అండర్సన్‌ మాకు సారీ చెప్పాడు. బౌలింగ్‌ యూనిట్‌లో భాగం కాలేదనందుకు క్షమించమన్నాడు.  ఆ సమయంలో ఎవరైనా ఏమీ చేయలేరు. అండర్సన్‌ త్వరగానే జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నాం’ అని బ్రాడ్‌ తెలిపాడు. అండర్సన్‌ బౌలింగ్‌కు దూరమైనా ఇంగ్లండ్‌ బౌలింగ్‌లో ఆకట్టుకుంది. బ్రాడ్‌ ఐదు వికెట్లతో సత్తాచాటగా, క్రిస్‌ వోక్స్‌ మూడు వికెట్లు సాధించాడు. దాంతో ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే కట్టడి చేశారు. కాగా, అండర్సన్‌ గాయపడటం యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బగా ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు