అనిరుధ్ సెంచరీ వృథా

17 Feb, 2014 00:07 IST|Sakshi

వడోదర: బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్)కు తొలి మ్యాచ్‌లో పరాజయం ఎదురైంది. ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏడు వికెట్ల తేడాతో ఎస్‌బీహెచ్‌పై ఘన విజయం సాధించింది.
 
ముందుగా ఎస్‌బీహెచ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనిరుధ్ సింగ్ (128 బంతుల్లో 110; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి సెంచరీ సాధించగా, మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. బీపీసీఎల్ బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ 33 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బీపీసీఎల్ 44.5 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసి విజయాన్నందుకుంది.
 
 ఉదయ్ కౌల్ (122 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్), సూర్య కుమార్ యాదవ్ (69 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 132 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అహ్మదాబాద్‌లో జరిగిన మరోమ్యాచ్‌లో ఆంధ్రాబ్యాంక్ ఐదు వికెట్ల తేడాతో కెమ్‌ప్లాస్ట్ చేతిలో ఓడిపోయింది. ఆంధ్రాబ్యాంక్ 44.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. అమోల్ షిండే 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెమ్‌ప్లాస్ట్ 36.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది.
 

మరిన్ని వార్తలు