ఆర్‌సీబీ బౌలింగ్ బలహీనం

20 Apr, 2016 00:26 IST|Sakshi

 హర్షా బోగ్లే

చాలా అరుదైన సందర్భాల్లో యజమాని వ్యక్తిత్వం మేరకు జట్టు రూపొందుతుంది. ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఈ పోలికకు చాలా దగ్గరగా ఉంది. విజయ్ మాల్యా గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన చాలా అంశాల్లో చాలా మందిని ఆకట్టుకున్నారు. అలాగే మాల్యాకు జీవితాన్ని మించిన గుర్తింపు కూడా లభించింది. ఇప్పుడు ఆర్‌సీబీ జట్టులోని ఆటగాళ్లు కూడా ఇదే తరహాలో ఉన్నారు. వీరిలో క్రిస్ గేల్ తన ఆట, ఇతరత్రా అంశాలతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. అయితే ఆడంబరాల విషయంలోనే కాకుండా ఆర్‌సీబీలో భారీ హిట్టర్లు, ఇతరులను ఆకర్షించే వ్యక్తిత్వాలు చాలా ఉన్నాయి. ఓ మామూలు జట్టు రాజస్తాన్ రాయల్స్‌లో ఉన్న వాట్సన్ కూడా ఇప్పుడు వీళ్లతో చేరిపోయాడు.

ఆర్‌సీబీలో టాప్-4లో ఉన్న గేల్, కోహ్లి, డివిలియర్స్, వాట్సన్‌లను చూస్తే ఎవరైనా ‘వావ్’ అనాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా టి20ల్లో వీళ్లను మించిన ఆటగాళ్లు ఉంటారని అనుకోవడం లేదు. ఎలాగైతే అద్భుతమైన ఆర్థిక నిపుణుల చుట్టూ బలమైన సంస్థలు ఏర్పడుతాయో గొప్ప ఆటగాళ్లతోనే టాప్ జట్లు కూడా తయారవుతాయి. అయితే ఇప్పుడు టి20ల్లో టాప్ జట్లు కూడా బౌలర్లను నమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు దానికి సరితూగేలా బౌలింగ్ కూడా ఉండాలి. బ్యాట్స్‌మన్ చేసిన స్కోరును బౌలర్లు కాపాడలేకపోయినప్పుడు వాళ్ల శ్రమ అంతా వృథానే.


నేడు ముంబై ఇండియన్స్‌తో ఆడబోయే మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఇదే సవాలును ఎదుర్కొబోతున్నాడు. కీలకమైన స్టార్క్, బద్రీలు గాయాలబారిన పడటం ఆర్‌సీబీ అవకాశాలపై ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ మిగతా బౌలర్లు ముంబై బ్యాట్స్‌మన్ ఎలా కట్టడి చేస్తారో చూడాలి. ఒకవేళ ఆర్‌సీబీ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తే లక్ష్యం ఎంత నిర్దేశించాలో ముంబైకి కచ్చితంగా తెలియదు. అయితే బెంగళూరు గనుక మొదట బ్యాటింగ్ చేస్తే స్కోరు బోర్డు మీద ఎన్ని పరుగులు ఉండాలనే అంశంపై ఆందోళన తప్పదు. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ బ్యాట్స్‌మన్ డికాక్ భారీ లక్ష్యాన్ని ఛేదించి చూపాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో రెండు మంచి జట్ల మధ్య ఓ రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.

>
మరిన్ని వార్తలు