ఫైనల్లో ఆస్ట్రేలియా

24 Jan, 2015 00:42 IST|Sakshi
ఫైనల్లో ఆస్ట్రేలియా

ఇంగ్లండ్‌పై విజయం
 
హోబర్ట్: ఈ మ్యాచ్ కంటే ముందు స్టీవెన్ స్మిత్ ఆసీస్ జట్టుకు మూడు మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు. వీటిలో ఏ మ్యాచ్‌లోనూ ఆసీస్ ఓడకపోవడంతో పాటు మూడింటిలోనూ అతను సెంచరీలు చేశాడు. ఇప్పుడు నాలుగో మ్యాచ్‌లో మళ్లీ సారథ్యం వహించాడు. ఇందులోనూ శతకం చేయడమే కా కుండా జట్టును విజయపథంలో నిలిపాడు. తొలి మూడు మ్యాచ్‌లు భారత్‌తో జరి గిన టెస్టులైతే... నాలుగోది ఇంగ్లండ్ తో వన్డే.

కొత్త ప్రత్యర్థి.. కొత్త ఫార్మా ట్... అయినా స్మిత్ (95 బంతుల్లో 102 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆట తీరు మాత్రం మారలేదు. సహచరులు వెనుదిరుగుతు న్నా... కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా... స్ఫూర్తిదాయకమైన ఇన్నిం గ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరి గిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
 
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 303 పరుగులు చేసింది. బెల్ (125 బంతుల్లో 141; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. రూట్ (70 బంతుల్లో 69; 6 ఫోర్లు), మొయిన్ అలీ (48 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సమయోచితంగా ఆడారు. బెల్... అలీతో కలిసి తొలి వికెట్‌కు 113; రూట్‌తో కలిసి మూడో వికెట్‌కు 121 పరుగులు జోడించాడు. చివర్లో బట్లర్ (25) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా స్లాగ్ ఓవర్లలో ఆసీస్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చూపారు.

దీంతో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో 4 వికెట్లు చేజార్చుకుంది. సంధూ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 7 వికెట్లకు 304 పరుగులు చేసి నెగ్గింది. మార్ష్ (45; 6 ఫోర్లు), ఫించ్ (32) తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే మూడు బంతుల వ్యవధిలో మార్ష్, వైట్ (0) అవుట్ కావడంతో ఆసీస్ ఇన్నింగ్స్ కాస్త తడబడింది.

కానీ స్మిత్... మ్యాక్స్‌వెల్ (37)తో కలిసి ఐదో వికెట్‌కు 69; ఫాల్క్‌నర్ (35)తో కలిసి ఆరో వికెట్‌కు 55; హాడిన్ (42; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఏడో వికెట్‌కు 81 పరుగులు జోడించాడు. చివరి 5 ఓవర్లలో 32 పరుగులు చేయాల్సిన దశలో కెప్టెన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వోక్స్, అలీ, ఫిన్ తలా రెండు వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు