వారం ముందుగానే లంక పర్యటన!

8 Jul, 2015 01:28 IST|Sakshi

ముంబై: వచ్చే నెలలో జరగనున్న శ్రీలంక పర్యటనను కనీసం ఓ వారం రోజులు ముందుగానే ప్రారంభించాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనివల్ల అక్టోబర్-నవంబర్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లభిస్తుందని భావిస్తోంది. ప్రస్తుతం మూడు వన్డేలు, రెండు టి20ల కోసం జింబాబ్వేకు వెళ్లిన టీమిండియా ఈ నెల 20న భారత్‌కు తిరిగిరానుంది. ‘రెండు మూడు రోజుల్లో లంక పర్యటనపై తుది నిర్ణయం తీసుకుంటాం. సెప్టెంబర్ 2 లేదా అంతకంటే ముందే లంక నుంచి తిరిగి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీనివల్ల దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు కచ్చితంగా ఓ నెల పాటు ఆటగాళ్లకు విశ్రాంతి లభిస్తుంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 11న లంక టూర్ ప్రారంభమవుతుంది. అయితే దీన్ని ఓ వారం ముందుగానే ప్రారంభించాలని భావిస్తున్నాం’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
 
సోనీకి ప్రసార హక్కులు
భారత్, శ్రీలంక సిరీస్‌కు సంబంధించిన ప్రసార హక్కులను సోనీ సంస్థ దక్కించుకుంది. ఇందులో భాగంగా 3.25 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 19 కోట్ల 50 లక్షలు) లంక బోర్డుకు ఇవ్వనుంది. టెన్ స్పోర్ట్స్ 1.85 మిలియన్ డాలర్ల (రూ. 11 కోట్ల 10 లక్షలు)తో పోటీకి దిగినా... సోనీ మాత్రం అత్యధిక ధరతో హక్కులను సొంతం చేసుకుంది.  భారత్, లంక మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా గాలెలో తొలి టెస్టు (ఆగస్టు 12 నుంచి 16 వరకు), కొలంబోలో రెండో టెస్టు (ఆగస్టు 20 నుంచి 24 వరకు), పల్లెకెలెలో మూడో టెస్టు (ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు) జరుగుతాయని సోనీ సిక్స్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే బీసీసీఐ దీన్ని అధికారికంగా ఆమోదించలేదు.

మరిన్ని వార్తలు