బీసీసీఐ, శ్రీనివాసన్‌కు ‘సుప్రీం’ నోటీసులు

31 Aug, 2013 01:41 IST|Sakshi

న్యూఢిల్లీ: బీసీసీఐ, ఎన్.శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారంపై విచారణ కోసం మరో కమిటీ ఏర్పాటును తోసిపుచ్చిన బాంబే హైకోర్టు తీర్పుపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) సుప్రీంకు వెళ్లింది. జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించి నోటీసులు జారీ చేసింది. గతంలో గురునాథ్ వ్యవహారంపై బీసీసీఐ ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిషన్‌ను బాంబే హైకోర్టు తప్పుపట్టింది.
 
  అది రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. అయితే సీఏబీ వేసిన పిల్‌ను బాంబే హైకోర్టు విచారణకు స్వీకరించడం సరి కాదని, తమది ప్రైవేట్ బాడీ అయినపుడు పిల్ ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ బీసీసీఐ కూడా గతంలోనే సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఇరువురి మధ్య క్రాస్ అప్పీల్‌ను వచ్చే నెల 11న సుప్రీం కోర్టు విచారించనుంది.
 
 మరోవైపు కోల్‌కతాలో ఆదివారం జరగబోయే బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరుకావాలా? వద్దా? అనే విషయంపై శ్రీనివాసనే నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు.
 

మరిన్ని వార్తలు