బెన్‌ స్టోక్స్‌ విజృంభణ

15 Dec, 2017 13:36 IST|Sakshi

క్రిస్ట్‌చర్చ్‌:ఓ వ్యక్తిపై దాడి కేసులో విచారణ ఎదుర్కొంటూ యాషెస్‌ సిరీస్‌ కు దూరమైన ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌.. న్యూజిలాండ్‌ దేశవాళీ లీగ్‌లో విజృంభించాడు. కాంటెర్‌బర్రీ తరపున బరిలోకి దిగి తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన స్టోక్స్‌ ఎట్టకేలకు జూలు విదిల్చాడు. గురువారం ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్‌ 47 బంతుల్లో ఏడు సిక్సర్లు, ఆరు బౌండరీలతో 93 పరుగులు సాధించి సత్తా చాటాడు. దాంతో కాంటెర్‌బర్రీ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 217 పరుగుల్ని సాధించగల్గింది. జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన స్టోక్స్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఆపై సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్‌ దిగిన ఒటాగో 83 పరుగులకే కుప్పకూలింది.ఫలితంగా కాంటర్‌బెర్రీ 134 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ లీగ్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో స్టోక్స్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు వన్డేల్లో కలిపి కేవలం 36 పరుగులు చేశాడు.

ఇటీవల ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనలో స్టోక్స్‌ విచారణ ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) నిషేధం ఎదుర్కొంటున్న స్టోక్స్‌.. కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్‌ దేశవాళీ లీగ్ ఆడటానికి స్వల్ప కాలిక ఒప్పందం చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు