ఆ విషయంపై స్పష్టత లేదు: భువనేశ్వర్‌ కుమార్‌

11 Mar, 2020 14:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రాణాంతక కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తి నేపథ్యంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఆటను కొనసాగిస్తామని టీమిండియా పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు. వైరస్‌ ప్రమాదం పొంచి ఉన్న క్రమంలో బంతిని షైన్‌ చేసేందుకు లాలాజలం(సెలైవా) ఉపయోగించాలా లేదా అన్న విషయంపై స్పష్టతకు రాలేదని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో ధర్మశాలలో గురువారం జరుగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘స్పోర్ట్స్‌ హెర్నియా’ సర్జరీ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన భువీ.. బుధవారం మీడియాతో మాట్లాడాడు. ‘‘సెలైవా ఉపయోగించకుంటే బంతిని షైన్‌ చేయలేం. దాంతో బ్యాట్స్‌మెన్‌ మా బౌలింగ్‌ను చీల్చిచెండాడుతారు. అప్పుడు.. బౌలింగ్‌లో పస లేదని మీరే అంటారు. కాబట్టి దీనికి పరిమితి పెట్టాలా లేదా అసలే వాడకూడదా అన్న విషయం గురించి ఆలోచిస్తున్నాం. జట్టు సమావేశం పూర్తయిన తర్వాత ఈ విషయంపై స్పష్టత వస్తుంది. టీం డాక్టర్‌ సలహాలు, సూచనల ప్రకారం నడుచుకుంటాం.(కరోనా ఎఫెక్ట్‌ : మాస్క్‌తో చహల్‌)

ఇక కరోనా వ్యాప్తి కారణంగా ప్రస్తుతం భారత్‌లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. మేం కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్‌ నిరంతరం మా వెంటే ఉంటారు. వ్యక్తిగత శుభ్రత పాటించడం, చేతులు తరచుగా కడుక్కోవడం వంటి వాటి ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు. అయితే మాపై ప్రేమ కురిపించే అభిమానులను దూరం పెట్టడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ ఈ పరిస్థితుల్లో తప్పదు’’ అని భువీ చెప్పుకొచ్చాడు. కాగా భారత్‌కు చేరుకున్న ప్రొటీస్‌ జట్టు సైతం మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. ఇక కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులతోనూ కరచాలనం చేయకూడదని సఫారీలను ఆదేశించినట్టు ఆ జట్టు ప్రధాన కోచ్‌ బౌచర్‌ వెల్లడించారు. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికల్‌ హెల్త్‌ సూపర్‌వైజర్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు.(కరోనాతో వ్యక్తి మృతి : భారత్‌లో తొలి కేసు..!)

మరిన్ని వార్తలు