మెకల్లోలం...

21 Feb, 2016 00:51 IST|Sakshi
మెకల్లోలం...

54 బంతుల్లోనే సెంచరీ
టెస్టుల్లో మెకల్లమ్ ప్రపంచ రికార్డు
79 బంతుల్లో 21 ఫోర్లు,
6 సిక్సర్లతో 145
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు

 
 క్రికెట్‌లో నా బ్రాండ్ ఆట అందరికీ గుర్తుండిపోతుందని బల్లగుద్ది గర్వంగా ప్రకటించుకున్న విధ్వంసకారుడు పోతూ పోతూ కూడా తనదైన ముద్ర వేశాడు. చాలా మందిలా చివరి మ్యాచ్‌లో ఆటకంటే భావోద్వేగాలకే ప్రాధాన్యం ఇస్తే అతను బ్రెండన్ మెకల్లమ్ ఎందుకవుతాడు? తాను నిశ్శబ్దంగా వెళ్లిపోయేవాడిని కాదని అతను చూపించాడు. అందుకే అలా ఇలా కాదు వీరబాదుడు బాదాడు. బ్యాటింగ్ కల్లోలంతో తన పేరిట కొత్త చరిత్రను లిఖించుకున్నాడు.

కివీస్ స్కోరు 32/3... పేస్, స్వింగ్‌కు అనుకూలిస్తున్న పచ్చటి హాగ్లీ ఓవల్ మైదానంలో ఆసీస్ బౌలర్లు భీకరంగా చెలరేగిపోతున్నారు. అటువైపు వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మన్ విలియమ్సన్ 44 బంతుల్లో చేసింది 3 పరుగులే! ఈ స్థితిలో తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతూ క్రీజ్‌లోకి వచ్చిన జట్టు కెప్టెన్‌పై ఎలాంటి ఒత్తిడి ఉంటుంది. కానీ మెకల్లమ్ ఇలాంటివేవీ లెక్క చేయలేదు. మదిలో ఒకటే ఆలోచన. అదే ఎదురుదాడి చేయడం! తన గురించి ప్రపంచానికి తెలిసిన విద్యనే మరోసారి మెకల్లమ్ ప్రదర్శించాడు. 54 బంతుల్లోనే ‘శత’క్కొట్టాడు. టి20 ప్రపంచకప్‌కు ముందే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్ర్కమిస్తున్న ఈ స్టార్ అంతకుముందే  ఆ వినోదాన్ని తన సొంత అభిమానులకు చూపించడం విశేషం.

 వన్డేలు, టి20ల్లో ఇన్నేళ్ల పాటు అందరికీ తన బాదుడు రుచి చూపించిన మెకల్లమ్ కెరీర్ ఆఖరి మ్యాచ్‌లో టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీతో ఫార్మాట్ ఏదైనా తన బ్యాటింగ్ సునామీకి తిరుగులేదని నిరూపించాడు. బౌలర్ ఎవరైనా, బంతి ఎలాంటిదైనా అతను నిర్దాక్షిణ్యంగా విరుచుకు         పడ్డాడు. తన ఆరాధ్య క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌ను గుర్తుకు తెచ్చేలా ఆడి రిచర్డ్స్ రికార్డునే తెరమరుగు చేశాడు. బ్రెండన్ మెరుపులకు క్రైస్ట్‌చర్చ్ మైదానం   హోరెత్తితే... న్యూజిలాండ్ దేశం యావత్తూ పులకించింది. తమ జాతీయ హీరోకి నీరాజనం పట్టింది. అందరి మదిలో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న... 

                                           
  మెకల్లమ్ ఎందుకు రిటైర్ అవుతున్నాడు?
క్రైస్ట్‌చర్చ్: అంతర్జాతీయ కెరీర్ చివరి మ్యాచ్‌లో బ్రెండన్ మెకల్లమ్ విశ్వరూపం చూపించాడు. ఆస్ట్రేలియాతో శనివారం ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్టులో అతను కేవలం 54 బంతుల్లోనే సెంచరీ సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో వివ్ రిచర్డ్స్ (56 బంతుల్లో; ఇంగ్లండ్‌పై 1986లో), మిస్బా వుల్ హక్ (56 బంతుల్లో; ఆస్ట్రేలియాపై 2014లో) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. మెకల్లమ్ (79 బంతుల్లో 145; 21 ఫోర్లు, 6 సిక్సర్లు)కు తోడు కోరీ అండర్సన్ (66 బంతుల్లో 72; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), వాట్లింగ్ (57 బంతుల్లో 58; 9 ఫోర్లు) కూడా ధాటిగా ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 370 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్, ప్యాటిన్సన్, జాక్సన్ బర్డ్ రెండేసి వికెట్లు తీసుకోగా... స్పిన్నర్ లియాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (12) అవుట్‌కాగా... బర్న్స్ (27 బ్యాటింగ్), ఉస్మాన్ ఖాజా (18 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.

 బాదుడే బాదుడు...
ఆసీస్ బౌలింగ్ ధాటికి కివీస్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన మెకల్లమ్ చెలరేగిపోయాడు. ఏ బౌలర్‌నూ అతను వదిలి పెట్టలేదు. మార్ష్ వేసిన ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 21 పరుగులు కొల్లగొట్టిన అతను ఆ తర్వాతా అదే జోరు కొనసాగించాడు. హాజల్‌వుడ్ వేసిన ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, మూడు ఫోర్లు కొట్టి 18 పరుగులు రాబట్టాడు. ఇదే ఓవర్ చివరి బంతికి కవర్స్ దిశగా కొట్టిన ఫోర్‌తో టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. 78 నిమిషాల్లోనే చకచకా అతని 12వ శతకం పూర్తి కావడం విశేషం. మెకల్లమ్, అండర్సన్ భాగస్వామ్యం కూడా దూకుడుగా సాగింది. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 18.2 ఓవర్లలోనే ఏకంగా 9.76 రన్‌రేట్‌తో 179 పరుగులు జోడించారు.

 నోబాల్ కావడంతో...
 రికార్డు ఇన్నింగ్స్‌లో మెకల్లమ్‌కు కాసింత అదృష్టం కూడా కలిసొచ్చింది. 39 పరుగుల వద్ద ప్యాటిన్సన్ బౌలింగ్‌లో షాట్ ఆడగా... గల్లీలో సంచలన రీతిలో ఒంటిచేత్తో మిచెల్ మార్ష్ క్యాచ్ అందుకున్నాడు. అయితే అది నోబాల్ కావచ్చని సందేహించిన అంపైర్ రీప్లే చూశాడు. ప్యాటిన్సన్ గీత దాటినట్లు తేలడంతో మెకల్లమ్ బతికిపోయాడు. ఆ తర్వాత మెకల్లమ్ వీరవిహారం చేశాడు.
 
 
 ‘ప్రతీ బంతిని ఫోర్ లేదా సిక్స్ కొట్టాలనే ప్రయత్నించాను. రికార్డు గురించి నాకు ఏమీ తెలీదు. అయితే ఇప్పుడు సంతోషంతో పాటు నేను ఎంతో అభిమానించే రిచర్డ్స్‌ను అధిగమించడం ఒకింత ఇబ్బందిగానే అనిపిస్తోంది. నోబాల్ తర్వాత మరింత దూకుడుగా ఆడే ధైర్యం వచ్చింది. ఆరంభంలోనే అవుటవుతానేమో అనిపించే విధంగా కొన్ని షాట్లు గుడ్డిగా ఆడాను. అవి ఫీల్డర్లకు దగ్గరి నుంచే వెళ్లాయి. ఈ పిచ్‌పై ఆడటం అంత సులువు కాదు. అందుకే రిస్క్ తీసుకొని ఎదురుదాడి చేశాను. ఇలాంటప్పుడు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. దేవుడు నా పక్షమే ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా దూకుడుగా ఆడేందుకే ప్రయత్నిస్తా
.’  -బ్రెండన్ మెకల్లమ్

మరిన్ని వార్తలు