చైన్ స్నాచర్గా మారిన మాజీ క్రికెటర్

17 Oct, 2015 18:42 IST|Sakshi
చైన్ స్నాచర్గా మారిన మాజీ క్రికెటర్

భోపాల్: రాష్ట్ర స్థాయిలో ఆడిన క్రికెటర్ పక్కదారి పట్టాడు. నేరాలను వృత్తిగా చేసుకుని ఓ గ్యాంగ్ను తయారు చేశాడు. దీనికి నాయకుడిగా ఉంటూ చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. చివరకు గ్యాంగ్తో సహా అరెస్టయి కటకటాలపాలయ్యాడు. మధ్యప్రదేశ్ అండర్-19 మాజీ క్రికెటర్ ముర్తజా అలీ (30) కథ ఇది.

ముర్తజా అలీతో పాటు చైన్ స్నాచర్ల గ్యాంగ్లోని షాదబ్, హైదర్, గుఫ్రాన్, రజా అలీని అరెస్ట్ చేసినట్టు జహంగీరాబాద్ ఏరియా సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సీఎస్పీ) సలీమ్ ఖాన్ చెప్పారు. 75కు పైగా నేరాల్లో వీరి ప్రమేయమున్నట్టు తెలిపారు. ఈ గ్యాంగ్ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడిందని చెప్పారు. వీరి నుంచి నాలుగు మోటార్ బైక్లు, పది బంగారు చైన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 22 వరకు పోలీస్ రిమాండ్కు ఆదేశించారు.

మరిన్ని వార్తలు