మైకేల్‌ క్లార్క్‌ భావోద్వేగ సందేశం

10 Sep, 2019 11:05 IST|Sakshi

సిడ్నీ:  గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌ కౌన్సిల్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌.. తాను స్కిన్‌ క్యాన్సర్‌ బారిన పడిన విషయాన్ని గుర్తు చేస్తూ యువ క్రికెటర్లకు భావోద్వేగ సందేశం ఇచ్చాడు. యువకులు ఎవరూ స్కిన్‌ బారిన పడకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. దానిలో భాగంగా క్యాన్సర్‌ బారిన పడి చికిత్స చేయించుకున్న తర్వాత తన నుదుటిపై ఉన్న కుట్లును చూపిస్తూ ఒక ఫోటో షేర్‌ చేశాడు.  ఇందుకు ఒక సందేశాత్మక క్యాప్షన్‌ను జోడించాడు.

‘మరొక రోజు.. నా ముఖానికి మరో స్కిన్‌ క్యాన్సర్‌ సర్జరీ జరిగింది.  యువకులకు నేనిచ్చే సందేశం ఒక్కటే. మీరు మీ శరీరాన్ని క్యాన్సర్‌ బారిన పడకుండా రక్షించుకుంటారనే అనుకుంటున్నా’ అని క్లార్క్‌ పేర్కొన్నాడు. 2006లో క్లార్క్‌కు తొలిసారి స్కిన్‌ క్యాన్సర్‌ రావడంతో అ‍ప్పట్లోనే చికిత్స చేయించుకున్నాడు. తాజాగా అతని నుదుటిపై క్యాన్సర్‌ కణుతులు రావడంతో వాటిని సర్జరీ ద్వారా తొలగించుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేశాడు క్లార్క్‌. ఆసీస్‌ యువకులు తమ శరీరాన్ని వారే సూర్యకాంతి నుంచి రక్షించుకోవాలని స్మిత్‌ ప్రధానంగా సూచించాడు. ఆస్ట్రేలియాలో స్కిన్‌ క్యాన్సర్‌ శాతం చాలా ఎక్కువ. 2016లో స్కిన్‌ క్యాన్సర్‌ బారిన పడి 1960 మంది ప్రాణాలు కోల్పోయారు.

2011లో రికీ పాంటింగ్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న క్లార్క్‌ ఆసీస్‌ క్రికెట్‌ జట్టును నడిపించడంలో సక్సెస్‌ అయ్యాడు. పాంటింగ్‌కు సరైన వారసుడిగా ఆసీస్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను క్లార్క్‌ అందించాడు. తన 12 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో 115 టెస్టులు, 245 వన్డేలతో పాటు 34 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో జరిగిన యాషెస్‌ సిరీస్‌ అనంతరం క్రికెట్‌ గుడ్‌ బై చెప్పాడు క్లార్క్‌.

Another day, another skin cancer cut out of my face... youngsters out there make sure you are doing all the right things to protect yourself from the sun ☀️🕶🎩

A post shared by Michael Clarke (@michaelclarkeofficial) on

>
మరిన్ని వార్తలు