కబడ్డీలో మరో లీగ్‌

11 Apr, 2019 15:45 IST|Sakshi

ఇండో ఇంటర్నేషనల్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సర్వం సిద్ధం

 మే 13 నుంచి పోటీలు  

న్యూఢిల్లీ: ప్రేక్షకుల నుంచి విపరీత ఆదరణ పొందిన గ్రామీణ క్రీడ కబడ్డీలో మరో లీగ్‌ రానుంది. ‘ఇండో ఇంటర్నేషనల్‌ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ (ఐపీకేఎల్‌)’ పేరిట మే 13న ప్రారంభం కానున్న ఈ లీగ్‌ జూన్‌ 4 వరకు అభిమానులను అలరించనుంది. లీగ్‌ విశేషాలతో పాటు లోగోను బుధవారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ డాషింగ్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పాల్గొన్నారు. పుణే, మైసూర్, బెంగళూరు వేదికల్లో ఈ టోర్నీని నిర్వహిస్తామని ఐపీకేఎల్‌ డైరెక్టర్‌ రవికిరణ్‌ ప్రకటించారు. తొలి సీజన్‌లో 44 మ్యాచ్‌లను నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం 160 మంది క్రీడాకారులు ఇందులో తలపడనున్నారు. వీరిలో 16 మంది విదేశీ ఆటగాళ్లు. ఆటగాళ్లకు యాజమాన్యం ఇచ్చే ప్రైజ్‌మనీ, జీతంతో పాటు, లీగ్‌ ద్వారా వచ్చే రెవెన్యూలో  20 శాతం అందజేయడం ఈ లీగ్‌ ప్రత్యేకత. డీడీ స్పోర్ట్స్‌తో పాటు 18 చానల్స్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ మూడు దశలుగా జరుగుతుంది.

తొలి దశలో పుణేలోని బాలేవాడి స్టేడియంలో మే 13నుంచి 21వరకు 20 మ్యాచ్‌లు జరుగుతాయి. తర్వాత మైసూర్‌లోని చాముండీ విహార్‌ స్టేడియంలో మే 24నుంచి 29 వరకు 17 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జూన్‌ 1నుంచి 4వరకు ఫైనల్‌తో కలిపి మొత్తం 7 మ్యాచ్‌లు జరుగుతాయి. బెంగళూరు రైనోస్, చెన్నై చాలెంజర్స్, డైలర్‌ ఢిల్లీ, తెలుగు బుల్స్, పుణే ప్రైడ్, హరియాణా హీరోస్, ముంబై చిరాజ్, రాజస్తాన్‌ రాజ్‌పుత్స్‌ జట్లు టైటిల్‌కోసం తలపడనున్నాయి. టోర్నమెంట్‌ లోగో ఆవిష్కరణ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్‌ మాట్లాడుతూ ‘జకార్తా పాలెంబాంగ్‌ ఆసియా క్రీడల కబడ్డీ టోర్నీలో భారత్‌ ఓడినప్పుడు నాతో పాటు దేశం మొత్తం బాధపడింది. కబడ్డీ దేశానికి గర్వంగా నిలిచే క్రీడ. కబడ్డీలో ఐపీకేఎల్‌ రావడం హర్షించదగిన విషయం. మరింత మంది కబడ్డీ ప్లేయర్లకు ఈ లీగ్‌ ఉపయోగపడుతుంది’ అని సెహ్వాగ్‌ అన్నాడు.

మరిన్ని వార్తలు