వారికిచ్చిన గౌరవం మాకేది?

1 Aug, 2017 16:26 IST|Sakshi
వారికిచ్చిన గౌరవం మాకేది?

ఢిల్లీ: తమ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వంపై భారత బధిర ఒలింపిక్స్ బృందం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. టర్కీలో జరిగిన డెఫ్లింపిక్స్ లో ఐదు పతకాలను సాధించి స్వదేశానికి చేరినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్వాగతం లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్రీడాకారులు, సహాయ సిబ్బంది సహా మొత్తం 46తో కూడిన బధిర ఒలింపిక్స్ బృందం మంగళవారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. అయితే అక్కడ వారికి స్వాగత ఏర్పాట్లు కనిపించకపోగా, కనీసం పలకరించే వారు కూడా ఎవరూ లేరు. దాంతో తీవ్ర నిరాశ చెందిన వారు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. గతంలో ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ లుకు వెళ్లిన వారికి ఘనమైన ఆహ్వానం పలికిన ప్రభుత్వం.. ఇప్పుడు తమ పట్ల ఎందుకు వివక్ష చూపుతుందంటూ మండిపడ్డారు. దేశం కోసం తాము సాధించిన పతకాలు తమకు అక్కర్లేదని, వాటిని తిరిగి ఇచ్చేస్తామన్నారు. తాము ఎప్పుడు వచ్చేది క్రీడామంత్రికి ముందుగానే సమాచారం ఇచ్చినా, తమను కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లేదిలేదంటూ అక్కడే బైఠాయించారు.

ఈ సందర్భంగా అఖిల భారత బధిర కౌన్సిల్ ప్రతినిధి కేతన్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.' ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులు స్వదేశం చేరుకున్నప్పుడు సంబరాలు చేసుకున్నాం. ఇప్పుడు మన క్రీడాకారులు ఐదు పతకాలతో తిరిగి వచ్చారు. మరి వీరు క్రీడాకారులు కాదా?, బధిర క్రీడాకారులపై చిన్నచూపు ఎందుకు?, వారికిచ్చిన గౌరవం మాకేది?, క్రీడల మంత్రి విజయ్ గోయల్ కు మా రాకపై సమాచారం ఇచ్చినా ఎటువంటి స్పందనా రాకపోవడం బాధగా ఉంది. ఇక మాకు వచ్చిన పతకాలు ఎందుకు?'అంటూ కేతన్ షా ప్రశ్నించారు. అయితే దీనిపై విజయ్ గోయల్ స్పందించారు. అనారోగ్యంతో రాలేకపోయానని వివరణ ఇచ్చుకునే యత్నం చేశారు. భారత క్రీడా బృందానికి కర్నూలు వాసి జఫ్రిన్ నేతృత్వం వహించారు.

మరిన్ని వార్తలు