టీమిండియా కోచ్‌ అవుతా: గంగూలీ

2 Aug, 2019 19:05 IST|Sakshi

కోల్‌కతా: త్వరలో భారత క్రికెట్‌ ప్రధాన కోచ్‌తో పాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌ల నియామకం జరుగనుంది. ఇటీవల కోచింగ్‌ స్టాఫ్‌ దరఖాస్తుల తేదీ ముగియడంతో ఇక ఎంపిక ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అటు విదేశీ మాజీలు, ఇటు భారత మాజీ క్రికెటర్లు కోచ్‌ పదవుల కోసం పోటీలో ఉన్నారు. ఆసీస్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ టామ్‌ మూడీతో పాటు కింగ్స్‌ పంజాబ్‌ కోచ్‌, న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెస్సెన్‌లు ప్రధాన కోచ్‌ పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇక భారత్‌ నుంచి రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లు కోచ్‌ పదవి కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

అయితే తనకు కోచ్‌ పదవి చేపట్టాలని ఉందని భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం కోచ్‌ పదవి కోసం అవకాశం లేకపోవడంతో మరొక సందర్భంలో అందుకోసం తాను కూడా పోటీలో ఉంటానన్నాడు. ‘ నాకు టీమిండియా కోచ్‌గా చేయాలని చాలా ఆసక్తిగా ఉంది. ఇప్పుడు తగిన సమయం కాదు. ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నా. భవిష్యత్తులో నేను కూడా కోచ్‌ పదవికి దరఖాస్తు చేస్తా’ అని గంగూలీ పేర్కొన్నాడు.  ‘ గత కొంతకాలంగా అనేక క్రికెట్‌ సంబంధిత వ్యవహారాలతో ఖాళీ లేకుండా ఉన్నా. ఐపీఎల్‌, క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌), టీవీ కామెంటరీ ఇలా పలు వ్యవహారాలు నా ముందు ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన తర్వాత నేను కూడా రేసులోకి వస్తా. ఏదొక సమయంలో భారత క్రికెట్‌ కోచ్‌ పదవిని అలంకరిస్తా’ అని గంగూలీ తెలిపాడు.

>
మరిన్ని వార్తలు