4 గంటల విచారణ.. చండిమాల్‌కు చుక్కెదురు

23 Jun, 2018 14:09 IST|Sakshi

గ్రాస్‌ ఐలెట్‌: తనపై విధించిన టెస్టు మ్యాచ్‌ సస్పెన్షన్‌ను సవాల్‌ చేసిన శ్రీలంక క్రికెట్‌ కెప్టెన్‌ చండిమాల్‌కు చుక్కెదురైంది. ఈ మేరకు మిచెల్‌ బెలాఫ్‌ నేతృత్వలోని ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కమిషన్‌.. చండిమాల్‌ అప్పీల్‌ను కొట్టేసింది. శుక్రవారం నాలుగు గంటల పాటు చండిమాల్‌ను విచారించిన తర్వాత సదరు జ్యుడిషియల్‌ కమిషన్‌ అతని అప్పీల్‌లో ఎటువంటి వాస్తవం లేదని తేల్చిచెప్పింది. దాంతో చండిమాల్‌కు మ్యాచ్‌ రిఫరీ జవగల్‌ శ్రీనాథ్‌ విధించిన ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌తో పాటు మ్యాచ్‌ ఫీజులో వంద శాతం జరిమానా యథావిధిగా అమలవుతుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.  చండిమాల్‌ సస్పెన్షన్‌పై ఎటువంటి  మార్పు లేకపోవడంతో వెస్టిండీస్‌తో జరుగనున్న చివరిదైన మూడో టెస్టుకు అతను దూరం కానున్నాడు.


విండీస్‌తో రెండో టెస్టులో భాగంగా చండిమాల్‌ మైదానంలో ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నం చేసినట్లు  రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ‘అతను నోటిలో ఏదో పదార్థాన్ని వేసుకొని నమిలి దాని ద్వారా ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్లు.. ఇదంతా వీడియో ఫూటేజీలో పరిశీలించిన తర్వాతే అతనిపై చర్యలు తీసుకున్నట్లు’ రిఫరీ తెలిపారు. ఐసీసీ నిబంధనల ప్రకారమే అతనిపై అభియోగాలు మోపి నిర్ధారించుకున్న తర్వాతే ఒక టెస్టు సస్పెన్షన్‌ విధించినట్లు వివరించారు. కాగా, తాను ఏ తప్పు చేయలేదని వాదించిన చండిమాల్‌.. రిఫరీ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లాడు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కమిషన్‌.. చండిమాల్‌ అప్పీల్‌ను తిరస్కరించింది.

కెప్టెన్‌గా లక్మల్‌..

ట్యాంపరింగ్‌ కారణంగా లంక రెగ్యులర్‌ కెప్టెన్‌ చండిమాల్‌ విండీస్‌తో మూడో టెస్టుకు దూరం కానున్న నేపథ్యంలో అతని స్థానంలో లక్మల్‌ను సారథిగా నియమిస్తూ ఆ దేశ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. మూడో టెస్ట మ్యాచ్‌కు లక్మల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయాన్ని ఎస్‌ఎల్‌సీ ఓ ప్రకటనలో తెలిపింది. విండీస్‌తో టెస్టు మ్యాచ్‌కు వెటరన్‌ రంగనా హెరాత్‌ను కెప్టెన్‌గా నియమించాలని ఎస్‌ఎల్‌సీ తొలుత భావించినా, అతను గాయం కారణంగా ఆఖరి టెస్టులో ఆడే అవకాశాలు తక్కువగా ఉ‍న్నాయి. దాంతో చండిమాల్‌ స్థానంలో సీమర్‌ లక్మల్‌ను కెప్టెన్‌గా నియమించారు.

మరిన్ని వార్తలు