టీమిండియా భారీ విజయం.. సిరీస్‌ కైవసం

13 Oct, 2019 15:20 IST|Sakshi

పుణే: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్‌కు దిగిన దక్షిణాఫ్రికాను 67.2 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్‌ చేసి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. ఈ రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీల ఇన్నింగ్స్‌ టీ బ్రేక్‌ తర్వాత ముగిసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో డీన్‌ ఎల్గర్‌(48), బావుమా(38), ఫిలిండర్‌(37), మహరాజ్‌(22)లు  మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారంతా దారుణంగా విఫలయ్యారు. దాంతో  కోహ్లి అండ్‌ గ్యాంగ్‌  ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది.

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో మార్కరమ్‌ను తొలి వికెట్‌గా ఇషాంత్‌ ఔట్‌ చేస్తే, డిబ్రుయిన్‌(8)ను ఉమేశ్‌ యాదవ్‌ బోల్తా కొట్టించాడు. సాహా అద్భుతమైన క్యాచ్‌తో డిబ్రుయిన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దాంతో 21 పరుగులకే సఫారీలు రెండు వికెట్లు కోల్పోగా, డుప్లెసిస్‌(5) అశ్విన్‌ ఔట్‌ చేశాడు. ఇక్కడ కూడా సాహా మరో చక్కటి క్యాచ్‌ పట్టడంతో డుప్లెసిస్‌ భారంగా పెవిలియన్‌ వీడాడు. ఆపై ఎల్గర్‌, డీకాక్‌(5),బావుమాలు పెవిలియన్‌ చేరారు. ఈ సమయంలో మహరాజ్‌-ఫిలిండర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసింది.  ఈ జోడి 57 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత ఫిలిండర్‌ ఔట్‌ కాగా, ఆపై కాసేపటికి రబడా పెవిలియన్‌ చేరాడు. (ఇక్కడ చదవండి: సాహా ‘కసి’ తీరా..!)

చివరి వికెట్‌గా మహరాజ్‌ ఔట్‌ కావడంతో భారత్‌కు ఇన్నింగ్స్‌ విజయం దక్కింది. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాలు తలో మూడు వికెట్లు సాధించగా, అశ్విన్‌ రెండు వికెట్లు తీశాడు. షమీ, ఇషాంత్‌లకు చెరో వికెట్‌ దక్కింది.  ఈ టెస్టులో విజయంతో భారత్‌ సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌  మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నామమాత్రమైన మూడో టెస్టు శనివారం రాంచీలో ఆరంభం కానుంది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 601/5 డిక్లేర్డ్‌
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 275 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 189 ఆలౌట్‌

మరిన్ని వార్తలు