‘తెలంగాణలో హిట్లర్‌ తరహా పాలన’

13 Oct, 2019 15:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి మృతి పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆర్‌. కృష్ణయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ పీఆర్టీయూ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులది ఆకలి పోరాటం కాదని..ఆత్మగౌరవ పోరాటం అని పేర్కొన్నారు. అధికారం ఉందని ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామంటే సహించే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో ప్రతీ ఒక్కరూ మోసపోయారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల ను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాల విద్యని నిర్వీర్యం  చేశారని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులు తమ వంతుగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచి సమ్మెని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.

ఇది ప్రభుత్వ హత్యే..
ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డిది ప్రభుత్వ హత్యేనని న్యూ డెమోక్రసి నేత గోవర్ధన్‌ విమర్శించారు. 48 వేల ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీనివాసరెడ్డి బలిదానం అయ్యారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పై మంత్రులు లేకుండా అధికారుల కమిటీ వేశారని ధ్వజమెత్తారు. కార్మికులు వేతనాల కోసం కాకుండా సంస్థ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారన్నారు. పక్క రాష్ట్రం సీఎం వైఎస్‌ జగన్ అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే.. తెలంగాణలో ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

సెల్ఫ్‌ డిస్మిస్ అంటూ కేసీఆర్ కొత్త పదం కనిపెట్టారన్నారు. తనను ప్రశ్నించారనే కారణంతో కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉద్యోగ సంఘాల నేతలు మద్దతు నివ్వాలని కోరారు. టీఎన్జీవో, టీజీవో నేతలు ముఖ్యమంత్రి పెట్టిన ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రగతిభవన్‌కు గులాంగిరి చేయడానికి వెళ్ళారని విమర్శించారు. కేసీఆర్‌ హిట్లర్‌ తరహాలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీనివాసరెడ్డి పార్థివదేహన్ని చూడనివ్వకుండా కార్మిక సంఘం నేతలను అరెస్ట్‌ చేస్తున్నారని మండిపడ్డారు.

ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలి
వెంటనే ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రిటైర్డ్‌ టీచర్స్‌, ఎంప్లాయీస్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. పలు తీర్మానాలు ప్రతిపాదిస్తూ ఉద్యోగ, రిటైర్డ్‌ సెల్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో ఉన్న పెన్షనర్స్‌ అందరూ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపాలని మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీనివాస్ రెడ్డి మరణం పట్ల  సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు