‘గోల్డెన్ అవర్’ను వృథా చేయొద్దు!

7 Oct, 2013 00:09 IST|Sakshi

పంజగుట్ట, న్యూస్‌లైన్: ప్రమాదం జరిగిన వెంటనే స్పందిస్తే రోగి ప్రాణాలు దక్కుతాయని, ఆ కీలక క్షణాలైన ‘గోల్డెన్ అవర్’ వృథా కాకుండా అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.
 
 108, అంబులెన్స్‌లకు ట్రాఫిక్‌లో దారి ఇవ్వాలంటూ రికాన్ ఫేస్ సంస్థ నిర్వహించిన ప్రచార కార్యక్రమాన్ని లక్ష్మణ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ రూపొందిన పోస్టర్, వాహనాలకు అంటించే స్టిక్కర్‌లను ఆయన ఆవిష్కరించారు. ‘అంబులెన్స్‌కు దారి ఇస్తే ఒక మనిషి ప్రాణాలు కాపాడినవారమవుతాము. మెట్రోరైల్ నిర్మాణ పనులతో పాటు ఇతరత్రా కారణాలతో ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి స్థితిలో అందరూ సహకరించాలని’ అని వీవీఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు కమిషనర్ అమిత్ గార్గ్ కూడా పాల్గొన్నారు.
 

 విదేశాల్లో అత్యవసర సేవల కోసం ప్రత్యేక రూట్‌లు ఉంటాయని, మన దగ్గర మాత్రం ట్రాఫిక్ కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఆగితే ఒక్క నిమిషం లోపు పంపాలని మా సిబ్బందిని ఆదేశించాం. ప్రతి ఒక్కరూ మానవత్వంతో సహకరించాలి’ అని అమిత్ గార్గ్ కోరారు. ఈ సందర్భంగా రికాన్ ఫేస్ సంస్థ కృషిని ప్రశంసించిన ఈ ఇద్దరూ సంస్థ ప్రతినిధులు వివేక్‌వర్ధన్ రెడ్డి, డాక్టర్ రితేశ్, డాక్టర్ నవీన్‌లను అభినందించారు.

మరిన్ని వార్తలు