హాఫ్‌ సెంచరీలతో గాడిలో పెట్టారు!

4 Oct, 2019 12:36 IST|Sakshi

విశాఖ: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌ ఆరంభంలో కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికా తేరుకుంది.  34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ నిలబెట్టాడు. ఎల్గర్‌ సుదీర్ఘం క్రీజ్‌లో పాతుకుపోయి హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. శుక్రవారం మూడో రోజు ఆట తొలి సెషన్‌లో భారత బౌలర్లు శ్రమించినా ఎల్గర్‌ వికెట్‌ ఇవ్వలేదు.  బావుమా(18)ను తొందరగా పెవిలియన్‌కు పంపినప్పటికీ ఎల్గర్‌ మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. అతనికి జతగా సఫారీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ అర్థ శతకం సాధించాడు. దాంతో దక్షిణాఫ్రికా గాడిలో పడింది.

39/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే బావుమా  వికెట్‌ను చేజార్చుకుంది. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో బావుమా ఎల్బీగా ఔట్‌ కావడంతో దక్షిణాఫ్రికా నాల్గో వికెట్‌ను కోల్పోయింది. దాంతో 63 పరుగులకు సఫారీలు నాల్గో వికెట్‌ను నష్టపోయారు. ఈ తరుణంలో ఎల్గర్‌-డుప్లెసిస్‌ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ముందుగా ఎల్గర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, లంచ్‌ తర్వాత డుప్లెసిస్‌ సైతం అర్థ శతకం సాధించాడు. వీరిద్దరూ వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 502/7 వద్ద డిక్లేర్డ్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు