359 పరుగుల లక్ష్యం... 45 ఓవర్లలోపే ఉఫ్‌! 

16 May, 2019 02:47 IST|Sakshi

మూడో వన్డేలో ఇంగ్లండ్‌ జయభేరి 

ఇమాముల్‌ వీరోచిత శతకం వృథా 

బెయిర్‌ స్టో మెరుపు సెంచరీ భళా 

రన్‌ పవర్‌ పెరుగుతోంది. ఛేదనెంతైనా సులువవుతోంది. మూడొందల పైచిలుకు కొండంత స్కోరైనా... బ్యాట్స్‌మెన్‌ ధాటికి కరిగిపోతోంది. పాపం బౌలర్లు! టి20ల దెబ్బకు కుదేలవుతున్నారు. వన్డేల్లోనూ వారిని దంచేస్తున్నారు.  

బ్రిస్టల్‌: పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగితే... ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ చితక్కొట్టారు. అంతే... కొండంత లక్ష్యం కాస్తా చిన్నబోయింది. 359 పరుగుల లక్ష్యాన్ని 5.1 ఓవర్ల ముందే ఛేదించి ఆతిథ్య ఇంగ్లండ్‌ జయభేరి మోగించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పాక్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ (131 బంతుల్లో 151; 16 ఫోర్లు, 1 సిక్స్‌) కెరీర్‌లోనే బెస్ట్‌ సెంచరీ బాదేశాడు. ఆసిఫ్‌ అలీ (53; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), హారిస్‌ సొహైల్‌ (41; 7 ఫోర్లు) రాణించాడు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 4 వికెట్లు పడగొట్టగా, టామ్‌ కరన్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 44.5 ఓవర్లలోనే 4 వికెట్లకు 359 పరుగులు చేసి గెలిచింది. ఈ జట్టులోనూ ఓపెనర్లే చెలరేగారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జానీ బెయిర్‌స్టో  (93 బంతుల్లో 128; 15 ఫోర్లు, 5 సిక్స్‌లు), జేసన్‌ రాయ్‌ (55 బంతుల్లో 76; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 17.3 ఓవర్లలోనే 159 పరుగులు జోడించడమే ఇంగ్లండ్‌ విజయానికి పునాది అయింది. తర్వాత వచ్చిన వారిలో రూట్‌ (43; 4 ఫోర్లు, 1 సిక్స్‌), మొయిన్‌ అలీ (46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్‌ ఈజీగా ఛేజింగ్‌ చేసింది.     

మోర్గాన్‌పై సస్పెన్షన్‌ వేటు 
దుబాయ్‌: స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సస్పెన్షన్‌కు గురయ్యాడు. అతనిపై ఒక వన్డే నిషేధం విధించడంతో పాటు  మ్యాచ్‌ ఫీజులో 40 శాతం కోత విధించారు. 12 నెలల వ్యవధిలో రెండోసారి స్లో ఓవర్‌ రేట్‌ నమోదవడంతో ఐసీసీ నిబంధనల మేరకు మ్యాచ్‌ రిఫరీ రిచీ రిచర్డ్సన్‌ అతనిపై చర్య తీసుకున్నారు. దీంతో మోర్గాన్‌ నాటింగ్‌హామ్‌లో రేపు జరిగే నాలుగో వన్డేకు దూరమయ్యాడు.  

మరిన్ని వార్తలు