మయాంక్‌, సిరాజ్‌లకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు?

13 Oct, 2018 11:42 IST|Sakshi

బీసీసీఐపై క్రికెట్‌ అభిమానుల ఫైర్‌

హైదరాబాద్‌ : వెస్టిండీస్‌తో ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న రెంటో టెస్ట్‌కు భారత జట్టులో మయాంక్‌ అగర్వాల్‌, మహ్మద్‌ సిరాజ్‌లకు అవకాశమివ్వకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. గత కొద్దిరోజులుగా డొమెస్టిక్‌ క్రికెటలో స్థిరంగా రాణిస్తున్న ఈ యువ ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సెలక్టర్లు కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్‌ కోహ్లి చెప్పినట్లే వింటున్నారని సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 8 మ్యాచ్‌ల్లో విఫలమైన కేఎల్‌ రాహుల్‌కు అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి విశ్రాంతి తీసుకొని మయాంక్‌ అవకాశం ఇచ్చి ఉండాల్సిందని ఒకరంటే.. కోహ్లి 25వ సెంచరీ పూర్తి చేసుకోవాలనే స్వార్థంతోనే విశ్రాంతి తీసుకోలేదని మరొకరు విమర్శించారు.

రెండో టెస్ట్‌లో యువ బౌలర్‌ శార్దుల్‌ ఠాకుర్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. కానీ అతను10 బంతులు వేయగానే తొండ కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు. దీంతో ఒక బౌలర్‌ సేవలను భారత్‌ కోల్పోయింది. దీనిపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ గురించి తెలియకుండా ఎలా ఎంపిక చేస్తారని, ఫిజియోలు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మహ్మద్‌ సిరాజ్‌కు అవకాశం ఇస్తే ఇలా జరిగేది కాదు కదా అని నిలదీస్తున్నారు. ఇలా అయితే ఆస్ట్రేలియా పర్యటనలో నెగ్గినట్టే అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

మరిన్ని వార్తలు