ఆ కొద్ది రోజులు వదిలేశాను...

20 Aug, 2016 02:13 IST|Sakshi
ఆ కొద్ది రోజులు వదిలేశాను...

చాంపియన్‌గా ఎదగడంలో క్రీడాకారులు ఎంతగా శ్రమిస్తారో వారి వెనక బయటికి కనిపించని తల్లిదండ్రుల కష్టం కూడా ఎంతో ఉంటుంది. తమ బిడ్డను ఆటకు సిద్ధం చేయడం, మంచి చెడూ చూసుకోవడం, గెలిచినప్పుడు అభినందించి, ఓడినప్పుడు ఫర్వాలేదు నేనున్నాననే నైతిక బలం, పగలనక, రాత్రనక తోడు నిలవడం... ఇది అమ్మానాన్నలకే సాధ్యం. ఒలింపిక్స్‌లో భారత జెండా ఎగరేసిన సింధు వెనక కూడా ఆమె తండ్రి పీవీ రమణ ఉన్నారు. రాకెట్ పట్టడం మొదలు రియోలో సంచలనం వరకు సింధు కెరీర్ గురించి ‘సాక్షి’తో రమణ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...


సరదాగానే మొదలు పెట్టి...
‘‘మా అమ్మాయిని ఈ స్థాయిలో నిలిపిన గోపీచంద్ వల్లే సింధు తొలి సారి రాకెట్ పట్టిందంటే ఆశ్చర్యం వేస్తుంది. తోటి క్రీడాకారులుగా నాకు, గోపీకి సాన్నిహిత్యం ఉంది. మేమిద్దరం ఒకేసారి 2000లో అర్జున అవార్డు అందుకున్నాం. ఒక కార్యక్రమంలో మా కుటుంబం గోపీని కలిసింది. అప్పుడతను సింధుతో ‘నువ్వు మీ అమ్మా నాన్నల్లా టీమ్ గేమ్ మాత్రం ఆడకు. ఆసక్తి ఉంటే బ్యాడ్మింటన్ ఆడు’ అన్నాడు. అది సింధు మనసులో నాటుకుపోయింది. ఇంటి దగ్గర సరదాగా మొదలు పెట్టాక రైల్వే గ్రౌండ్స్‌కు తీసుకెళ్లాను. అక్కడ కోచ్ మహబూబ్ అలీ ప్రాథమికాంశాలు నేర్పించారు. గోపీచంద్ అకాడమీ మొదట్లో కొద్ది రోజులు ఎల్బీ స్టేడియంలో నడిచింది. వెస్ట్ మారేడ్‌పల్లిలోని మా ఇంటినుంచి అక్కడికి తీసుకెళ్లటం, తీసుకురావడం ఇబ్బంది కాలేదు. అయితే గోపీ అకాడమీ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంకు మారడంతో సమస్య మొదలైంది. నాలుగు రోజులు మాలాగే చాలా మంది పిల్లల ట్రైనింగ్ ఆగిపోయింది. అయితే ఒక వ్యాపారవేత్త కొద్ది రోజుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి ఈ పిల్లలను అక్కడికి తీసుకెళ్లేందుకు సహకరించారు. మరి కొన్నాళ్లకు అదీ నిలిచిపోయింది. దాంతో నా ఉద్యోగం చేస్తూ సింధుకు అంత దూరం తీసుకు పోవడం సాధ్యం కాదని అర్థమైపోయింది. ఆ దశలో కొద్ది రోజులు పూర్తిగా వదిలేయడంతో అమ్మాయి ఆట ఆగిపోయింది. కొద్ది రోజుల తర్వాత మళ్లీ కలిసినప్పుడు గోపి కనీసం వారానికి రెండు సార్లు తీసుకు రావచ్చు కదా అని అడిగాడు. దాంతో మళ్లీ కొత్తగా నా టైమ్‌టేబుల్ ప్రారంభమైంది. ఈ సారి ఎంత శ్రమకు ఓర్చయినా సరే 25 కిలోమీటర్ల దూరం ఉన్న గచ్చిబౌలికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాను. నాలుగు రోజుల ఆటకే సింధు ‘నాన్నా నాకు ఆట బాగా నచ్చేసింది. ప్రతీ రోజూ వస్తాను’ అని ఉత్సాహంగా చెప్పడంతో ఇక అప్పటినుంచి ఆట ఆగలేదు. కొన్నాళ్లకు గోపీకి సొంత అకాడమీ వచ్చాక సింధును పూర్తిగా అక్కడే ఉంచేశాను. అటుపై గచ్చిబౌలికి నేనూ ఇల్లు మారిపోయాను.

 
ముందే కొట్టేసింది

సింధులో మంచి ప్రతిభ ఉంది. కనీసం 23-24 ఏళ్ల వయసు వచ్చే సరికి గొప్ప ఫలితాలు సాధిస్తుంది అని పదేళ్ల క్రితం కోచింగ్ ప్రారంభమైనప్పుడు గోపీచంద్ చెప్పాడు. కానీ మరో రెండేళ్ల ముందే ఆమె ఒలింపిక్ మెడల్ గెలుస్తుందని అతను కూడా ఊహించలేదు! నా ఉద్దేశం ప్రకారం కూడా సింధు చాలా వేగంగా దూసుకుపోయింది. ఆట ప్రారంభించినప్పుడు భారత్‌కు ఆడుతుందని మాత్రమే నమ్మాను. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాక ఆమె ఏదైనా సాధించగలదని అనిపించింది. ఆ రోజు నా మనసులో తొలిసారి ఒలింపిక్స్ పతకం మెదిలింది. రియో కోసం ఆమె పడ్డ శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే. వదిలేయ్ నాన్నా, ఇదంతా చేయాలా అని ఒకప్పుడు ఉదాసీనత ప్రదర్శించిన విషయాల్లో కూడా ఆమె కఠోర సాధన చేసింది. దాని ఫలితం బాగా ఉండబోతోందని ఆమెకు అర్థమైంది. అందుకే వెయిట్ ట్రైనింగ్, ఎక్సర్‌సైజ్‌లపై మరింత శ్రద్ధ చూపి అద్భుతమైన ఫిట్‌నెస్‌ను సాధించింది. అది ఆటలో కనిపించింది. ఇప్పుడు దేశం మొత్తం సింధు వైపు చూసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆమెకు గుర్తింపు లభించింది. మ్యాచ్ జరిగే సమయంలో కనిపించే ఉద్వేగాలు ఆ తర్వాత సాధారణంగా మారిపోవచ్చు. కానీ నా కూతురు కూడా ఒలింపిక్ మెడలిస్ట్ అని నేను చెప్పుకునే అవకాశం ఆమె నాకు ఇచ్చింది. నా బిడ్డ ఘనత పట్ల తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా’’

 

మరిన్ని వార్తలు