విద్యా కార్యక్రమాలు అన్నింటిలోనూ బయోమెట్రిక్‌ | Sakshi
Sakshi News home page

విద్యా కార్యక్రమాలు అన్నింటిలోనూ బయోమెట్రిక్‌

Published Sat, Aug 20 2016 2:08 AM

విద్యా కార్యక్రమాలు అన్నింటిలోనూ బయోమెట్రిక్‌ - Sakshi

ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరేకాదు..
మధ్యాహ్న భోజనం తదితర పథకాలన్నింటికీ వర్తింపు
ఆధార్‌తోనూ అనుసంధానం, నిర్వహణకు ప్రత్యేక సర్వర్‌ చర్యలు చేపడుతున్న విద్యాశాఖ


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల రోజువారీ హాజరు కోసం బయోమెట్రిక్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టిన విద్యాశాఖ.. తాజాగా అన్ని విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు, రవాణా సదుపాయం వంటి ప్రయోజనాలకు కూడా బయోమెట్రిక్‌ను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. దీనిని ఆధార్‌తోనూ అనుసంధానం చేసి తప్పుడు సమాచారానికి ఆస్కారం లేకుండా, విద్యా ప్రయోజనాలు దుర్వినియోగం కాకుండా చూడాలని భావిస్తోంది. వీటితోపాటు అకడమిక్‌ అంశాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వంటి అన్నింటిలోనూ బయోమెట్రిక్‌ హాజరు, ఆధార్‌ అనుసంధానంతో పక్కాగా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం విద్యాశాఖ ప్రత్యేక సర్వర్‌ను ఏర్పాటు చేసి, నేషనల్‌ ఇన్‌ఫర్మాటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ఆధ్వర్యంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని 61 లక్షల మంది విద్యార్థుల ఆధార్‌ సమాచారాన్ని అథెంటికేషన్‌ యూజర్‌ ఏజెన్సీ(ఏయూఏ) కింద తమకు ఇవ్వాలని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ)కు విద్యాశాఖ లేఖ రాసింది.

ఇప్పటికే పూర్తయిన 60 శాతం ఆధార్‌
రాష్ట్రంలో ఇప్పటికే 60 శాతానికిపైగా విద్యార్థుల ఆధార్‌ సమాచారాన్ని సేకరించిన విద్యాశాఖ.. రెండు నెలల్లో మిగతా విద్యార్థుల ఆధార్‌ సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 61 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఇప్పటికే 40 లక్షల మందికిపైగా విద్యార్థుల ఆధార్‌ పూర్తయింది. ఆధార్‌ నెంబరు లేని వారు తీసుకునేలా చర్యలు చేపట్టాలని అన్ని పాఠశాలల అధికారులు, యాజమాన్యాలను ఆదేశించింది. రాష్ట్రంలో 25,561 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో మొదట 6,391 పాఠశాలల్లో బయోమెట్రిక్‌  విధానాన్ని అమలు చేసేలా చర్యలు చేపట్టింది. మిగతా 19,170 ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేసేందుకు చర్యలు ప్రారంభించింది. దీని ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఎంత మంది విద్యార్థులకు అందాయన్నది  స్పష్టంగా తెలియనుంది. విద్యార్థుల వయసు పెరిగే కొద్దీ వేలిముద్రలు మారే అవకాశం ఉన్నందునా బయోమెట్రిక్‌ డాటాను ఐదేళ్లకోసారి అప్‌డేట్‌ చేస్తామని విద్యాశాఖ తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement