‘మీ బాగోతం బయటపెడతా.. స్టే ట్యూన్డ్‌’

12 Dec, 2019 15:50 IST|Sakshi

క్రికెట్‌ బోర్డుకు మాజీ కెప్టెన్‌ బెదిరింపులు

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌లో ఇప్పుడు పెద్ద దుమారమే రేపాడు ఆ జట్టు మాజీ కెప్టెన్‌ గుల్బదీన్‌ నైబ్‌.  అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డులో ఎంతటి రాజకీయాలు నడుస్తున్నాయో, అంతే స్థాయిలో అవినీతి కూడా జరుగుతుందంటూ నైబ్‌ ఒక్కసారిగా కలకలం సృష్టించాడు. దీనిలో భాగంగా వరుస ట్వీట్లు చేస్తూ బోర్డులోని పెద్దల్ని కలవరపాటుకు గురి చేశాడు. ‘ డియర్‌ అఫ్గాన్‌ ఫ్యాన్స్‌. నేను నేను బయటకు రావడానికి కారణం ఏ ఒక్కరి మీదో వ్యక్తిగత కక్ష కాదు. అదే సమయంలో క్రికెట్‌ బోర్డుపై కూడా నాకు ద్వేషం లేదు. అఫ్గాన్‌ బోర్డులోని పెద్దలు అవినీతిలో కూరుకుపోయారు. యాక్షన్‌ తీసుకుంటానంటే చెప్పండి.. వారి పేర్లు బయటపెడతా. పలువురు క్రికెటర్లు, బోర్డులోని ప్రముఖులు అవినీతికి పెద్ద పీట వేస్తున్నారు’ అంటూ అలజడి రేపాడు. ఇలా వరుస పెట్టి ట్వీట్లు చేస్తూ కొత్త వివాదానికి తెరలేపాడు.

‘ఇప్పటివరకూ నేషనల్‌ లీగల్‌ ఏజెన్సీ అవినీతికి పాల్పడుతున్న వారిపై ఏమైనా యాక్షన్‌ తీసుకుంది. ఒకవేళ దానిపై సదరు అథారిటీ ఏమీ యాక్షన్‌ తీసుకోలేకపోతే నేను వారి పేర్లు బయటకు పెడతా. అప్పుడు చాలా సిగ్గుగా ఉంటుంది. గవర్నమెంట్‌ అధికారులు దగ్గర్నుంచీ బోర్డు సభ్యులు, ఆటగాళ్లు, మాజీ బోర్డు మెంబర్లు, మేనేజ్‌మెంట్‌ సభ్యుల పేర్లు వారి కరప్షన్‌ను బయటపెడతా. నన్ను ప్రేమించే అభిమానులు స్టే ట్యూన్డ్‌’ అని నైబ్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు.

2019 వరల్డ్‌కప్‌కు నైబ్‌ అఫ్గాన్‌ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. జట్టులో అత్యంత సీనియర్‌ ఆటగాళ్లలో ఒకడైన నైబ్‌ను వరల్డ్‌కప్‌కు అఫ్గాన్‌ జట్టు వెళ్లే చివరి నిమిషంలో కెప్టెన్‌గా నియమించారు. అస్గార్‌ అఫ్గాన్‌ను తప్పించి నైబ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే ఆ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేక పోయింది. దాంతో ఆ తర్వాత రషీద్‌ ఖాన్‌ను అన్ని ఫార్మాట్లకు అఫ్గాన్‌ సారథిగా ఎంపిక చేసింది. అయినప్పటికీ అఫ్గాన్‌ తలరాత మారకపోవడంతో తిరిగి అస్గార్‌ అఫ్గాన్‌ను అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమిస్తూ అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు(ఏసీబీ) నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు