హామిల్టన్ ‘హ్యాట్రిక్’

11 Jul, 2016 01:58 IST|Sakshi
హామిల్టన్ ‘హ్యాట్రిక్’

* వరుసగా మూడోసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): ఈ సీజన్ ఆరంభంలో నిరాశపరిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. సొంతగడ్డపై జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములవన్ రేసులో హామిల్టన్ వరుసగా మూడో ఏడాది విజేతగా నిలిచి ‘హ్యాట్రిక్’ సాధించాడు.   ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ నిర్ణీత 52 ల్యాప్‌లను గంటా 34 నిమిషాల 55.831 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఐదు రేసుల్లో నాలుగింట హామిల్టనే విజయం సాధించడం విశేషం.

ఓవరాల్‌గా హామిల్టన్‌కిది నాలుగో బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్. 2008లో తొలిసారి అతను ఈ టైటిల్‌ను నెగ్గాడు. ఈ గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రోస్‌బర్గ్ (171 పాయింట్లు), హామిల్టన్ (167 పాయింట్లు) మధ్య తేడా నాలుగు పాయింట్లకు చేరింది. ఈ సీజన్‌లో మరో 11 రేసులు మిగిలి ఉన్నాయి. తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది.
 
హామిల్టన్ సహచరుడు రోస్‌బర్గ్‌కు రెండో స్థానం లభించగా... వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ రేసులో ఆరుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లిద్దరూ టాప్-10లో నిలిచారు. సెర్గియో పెరెజ్‌కు ఆరో స్థానం, హుల్కెన్‌బర్గ్‌కు ఏడో స్థానం లభించింది.

మరిన్ని వార్తలు