హార్దిక్‌ పాండ్యా ఔట్‌

22 Feb, 2019 03:24 IST|Sakshi

వెన్నునొప్పితో ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరం

అతడి స్థానంలో వన్డేలకు రవీంద్ర జడేజా ఎంపిక

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్‌నకు వంద రోజుల సమయం కూడా లేని నేపథ్యంలో టీమిండియాకు అనుకోని దెబ్బ. పేస్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయం కారణంగా ఆస్ట్రేలియాతో టి20, వన్డే సిరీస్‌లకు పూర్తిగా దూరమయ్యాడు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న పాండ్యాను వైద్యుల బృందం సూచన మేరకు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కు పంపుతున్నట్లు బీసీసీఐ గురువారం తెలిపింది. వచ్చే వారం అతడికి ఎన్‌సీఏలో ప్రత్యేక చికిత్స ఉంటుంది. ఆసీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు పాండ్యా స్థానాన్ని స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో భర్తీ చేయనున్నారు. టి20 జట్టులో మాత్రం పాండ్యా స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు.  

స్పిన్నర్లే కీలకం 
సాక్షి, హైదరాబాద్‌: రానున్న వన్డే సిరీస్‌లో స్పిన్నర్లే గెలుపోటములను నిర్దేశిస్తారని ఆస్ట్రేలియా స్పిన్‌ కన్సల్టెంట్‌ శ్రీధరన్‌ శ్రీరామ్‌ అన్నా డు. గురువారం హైదరాబాద్‌లో ఆస్ట్రేలియా ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. భారత్‌కు తగ్గట్లు తమకూ స్పిన్‌ బలం ఉన్న నేపథ్యంలో సిరీస్‌ హోరాహోరీగా జరుగనుందని శ్రీరామ్‌ పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్న భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై అతడు ప్రశంసలు కురిపించాడు. ప్రధాన పేసర్లు లేకున్నా కమిన్స్, కూల్టర్‌నైల్‌ రూపంలో ఆసీస్‌కు మెరుగైన వనరులున్నాయని అతడు అన్నాడు. భారత కెప్టెన్‌ కోహ్లిని అడ్డుకోవడానికి తమవద్ద ప్రణాళికలు ఉన్నాయని శ్రీరామ్‌ వివరించాడు.


 

మరిన్ని వార్తలు