హుసాముద్దీన్‌కు రజతం

6 May, 2019 15:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ సీజన్‌లో మరో అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు మెరిశారు. పోలాండ్‌లో జరిగిన ఫెలిక్స్‌ స్టామ్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలు లభించాయి. గౌరవ్‌ సోలంకి (52 కేజీలు), మనీశ్‌ కౌశిక్‌ (60 కేజీలు) స్వర్ణాలు సాధించగా... సెమీస్‌లో ఓడిన మన్‌దీప్‌ జాంగ్రా (69 కేజీలు), అంకిత్‌ ఖటానా (64 కేజీలు), సంజీత్‌ (91 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు.

భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ 56 కేజీల విభాగంలో రజత పతకం గెలిచాడు. ఫైనల్స్‌లో గౌరవ్‌ 5–0తో విలియమ్‌ కాలే (ఇంగ్లండ్‌)పై, మనీశ్‌ 4–1తో మొహమ్మద్‌ హమూత్‌ (మొరాకో)పై నెగ్గగా... హుసాముద్దీన్‌ 1–4తో ముఖమ్మద్‌ షెకోవ్‌ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ఈ ఏడాది హుసాముద్దీన్‌కిది రెండో అంతర్జాతీయ రజత పతకం. ఫిన్‌లాండ్‌లో జరిగిన గీ బీ టోర్నీలోనూ హుసాముద్దీన్‌కు రజతమే లభించింది.

మరిన్ని వార్తలు