‘ఇక పాక్‌ క్రికెట్‌ జట్టును నేను సెట్‌ చేస్తా’

22 Jul, 2019 15:44 IST|Sakshi

వాషింగ్టన్‌: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు లీగ్‌ దశ నుంచే నిష్క్రమించిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రక్షాళనకు నడుంబిగించారు. స్వతహాగా క్రికెటర్‌ అయిన ఇమ్రాన్‌ ఖాన్‌.. వచ్చే వరల్డ్‌కప్‌ నాటికి పాక్‌ జట్టును మేటి జట్టుగా తయారు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ పాక్‌ క్రికెట్‌ జట్టు వరల్డ్‌కప్‌ ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ నా వ్యాఖ్యలు గుర్తుంచుకోండి. వచ్చే వరల్డ్‌కప్‌కు పాక్‌ జట్టు ఒక ప్రొఫెషనల్‌ జట్టుగా మారుస్తా. అత్యుత్తమ ఆటగాళ్ల ఎంపికే లక్ష్యంగా ముందుకెళతాం.

ఇందుకోసం క్షేత్ర స్థాయిలో చర్యలకు శ్రీకారం చుడతాం. ఎక్కడైతే టాలెంట్‌ ఉందో వారిని కచ్చితంగా సానబెడతాం. ఇక నుంచి పాక్‌ క్రికెట్‌ జట్టు ఎలా ఉండాలనేది నేను సెట్‌ చేస్తా. పాక్‌ జట్టు ఉన్నత శిఖరాలు తీసుకు వెళ్లాలని నేను డిసైడ్‌ అయ్యా’ అని పేర్కొన్నారు. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ జట్టు ఐదో స్థానంలో నిలిచి లీగ్‌ దశలోనే తన ప్రస్థానాన్ని ముగించింది. గ్రూప్‌ దశలో పాకిస్తాన్‌ నిలకడలేమి ఆ జట్టు నాకౌట్‌ ఆశల్నిదూరం చేసింది. కివీస్‌తో సమానంగా 11 పాయింట్లు సాధించినప్పటికీ రన్‌రేట్‌ ఆధారంగా పాక్‌ వెనుకబడిపోయింది. ప్రధానంగా వెస్టిండీస్‌ చేతిలో పాకిస్తాన్‌ ఘోర ఓటమి ఎదుర్కోవడం ఆ జట్టు సెమీస్‌ అవకాశాల్ని దూరం చేసింది.

>
మరిన్ని వార్తలు